పోలవరం.. ముందుకు కదిలేనా?
ABN , First Publish Date - 2023-12-05T04:00:25+05:30 IST
పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిలిచిపోయిన పనులు, నిధులపై ఎంతకూ స్పష్టత రావడం లేదు.

రూ.15,505 కోట్ల అంచనాను ఆమోదిస్తారా?
డయాఫ్రం వాల్ సంగతేంటో?
కొత్తదా.. పాతదానికే మరమ్మతులా?
నేడు కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిలిచిపోయిన పనులు, నిధులపై ఎంతకూ స్పష్టత రావడం లేదు. అదెప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కీలక భేటీ జరుగనుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, కేంద్ర జల సంఘం, సీఎ్‌సఎంఆర్‌ఎస్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు పాల్గొంటారు. ప్రధానంగా ప్రాజెక్టు పనులపై కేంద్ర సంస్థల నిరంతర పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో రాష్ట్ర జల వనరుల శాఖ ఒప్పందం, ప్రాజెక్టు డిజైన్లపై కేంద్ర ప్రభుత్వ సంస్థల బాధ్యత.. నిర్మాణంలో నాణ్యతపై కాంట్రాక్టు సంస్థ జవాబుదారీతనం వంటి అంశాలపై దేబర్షి సమీక్షిస్తారు. గత నెల 16నే ఈ సమీక్ష నిర్వహించాల్సి ఉన్నా..
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఇతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. పోలవరం నిర్మాణం కోసం ముందస్తుగా రూ.10,000 కోట్లను.. మరమ్మతుల కోసం రూ.2,000 కోట్లను మంజూరు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరగా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వెంటనే కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దీంతో త్వరలోనే కేబినెట్ భేటీలో దీనిని పెడతారని.. పెద్ద మొత్తం కేంద్రం నుంచి వస్తుందని ముఖ్యమంత్రి ఆశించారు. కానీ అలా జరుగలేదు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరించింది. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ వాటాల పునఃపంపిణీ బాధ్యతను బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు కట్టబెడుతూ అక్టోబరు 4వ తేదీన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఇంకోవైపు..పోలవరం ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.15,505 కోట్లను విదుదల చేయాలంటూ రాష్ట్ర జల వనరుల వాఖ పంపిన ప్రతిపాదనలపై ఇప్పటిదాకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. లెక్కల్లో తేడాలు కనిపించిన ప్రతిసారీ కేంద్ర ఆర్థిక శాఖ.. రాష్ట్ర జల వనరుల శాఖనడిగి సందేహ నివృత్తి చేసుకుంటోంది. అయినా.. ఈ సందేహాలకు ఫుల్‌స్టాప్ పడలేదు. ఒకదాని వెంట మరొకటి అడుగుతూనే ఉంది. మంగళవారం సమావేశంలోనైనా దీనిపై స్పష్టత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
డయాఫ్రం వాల్ ఎప్పటికో..
వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్త ప్లాస్టిక్ డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని సెంట్రల్ సోయిల్-మినరల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్‌సఎంఆర్‌ఎస్), గతంలోవాల్ నిర్మించిన జర్మనీ సంస్థ బావర్ సూచించాయి. రాష్ట్ర జల వనరులశాఖ కూడా ఇదే తీర్మానించి పీపీఏకి పంపింది. దీనిపైనా జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సమ్మతిస్తే ఈ నెలాఖరులోగా డిజైన్లు సమర్పిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ అంటోంది. వాటికి కేంద్ర జల సంఘం ఆమోదం పొందాలి. కొత్త వాల్ నిర్మాణం ఇప్పటికిప్పుడు చేపట్టినా.. 2025 నాటికి గానీ పూర్తికాదు. ఆ తర్వాత దానిపై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మించేందుకు మరో రెండేళ్లు పడుతుంది. అంటే నాలుగేళ్లు పడుతుందన్న మాట. ఇక ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ నివారణకు కూడా కేంద్రం ఇప్పటివరకు పరిష్కార మార్గం చూపలేదు. వీటన్నిటిపై మంగళవారంనాటి భేటీలో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.