Egg Jagan's campaign : గుడ్డుపైనా గుద్దేశారు!
ABN , First Publish Date - 2023-07-28T03:18:24+05:30 IST
జగన్(Jagan) ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ప్రభుత్వ కార్యాలయాలపై సొంత పార్టీ రంగులేసుకున్నారు. సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మ(Jagan pics) పడింది. ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల(Government Certificates)పైనా ఆయన చిత్రమే.

అంగన్వాడీ కోడిగుడ్డునూ వదల్లేదు
‘సంపూర్ణ పోషణ’ గుడ్లపై వైఎస్సార్ ఎస్పీ, ‘జగనన్న గోరుముద్ద’పై జే జీఎమ్ ముద్ర
తండ్రీకొడుకుల పేర్లు కనిపించేలా డిజైన్
పరాకాష్ఠకు చేరిన జగన్ ప్రచారపిచ్చి
అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జగన్(Jagan) ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ప్రభుత్వ కార్యాలయాలపై సొంత పార్టీ రంగులేసుకున్నారు. సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మ(Jagan pics) పడింది. ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల(Government Certificates)పైనా ఆయన చిత్రమే. ఇప్పుడు అంగన్వాడీ(Anganwadi)ల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లను సైతం వదల్లేదు. పిల్లలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఇచ్చే గుడ్లపై వైఎస్సార్ ఎస్పీ అని, జగనన్న గోరుముద్ద కింద అందించే గుడ్లపై జే జీఎమ్ అని ముద్ర వేసి పంపిణీ చేస్తున్నారు. తండ్రీకొడుకుల పేర్లు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేయడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతినెలా వైఎస్సార్ పోషణ, పోషణ ప్లస్ పథకాలను చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు సుమారు 22 లక్షల 76 వేలమంది వరకు అంగన్వాడీలు కేంద్రంగా అందుకుంటున్నారు. ఇందులో మూడొంతులమంది చిన్నారులే. వైఎస్సార్ పోషణ కింద ప్రతినెలా అంగన్వాడీల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్ర్తీలకు 25 చొప్పున, గిరిజన ప్రాంతాల్లో అయితే వీరికి 30 చొప్పున కోడిగుడ్లు(eggs) ఇస్తారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు జగన్ చూపు గుడ్డుపై పడింది. సంపూర్ణ పోషణ పథకాన్ని షార్ట్ కట్ చేసి’ వైఎస్సార్ ఎస్పీ’ అంటూ కోడిగుడ్లపై ముద్రించి మరీ పంపిణీ చేస్తున్నారు. కోడిగుడ్లు నెలకు మూడు సార్లు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారు. ప్రతినెల ఒకటోతేదీ నుంచి 10వ తేదీ వరకు కోడిగుడ్లపై పింక్ కలర్, 11 నుంచి 20వ తేదీ వరకు సరఫరా చేసే గుడ్లపై బ్లూ కలర్, 21 నుంచి నెల చివరి వరకు గ్రీన్ కలర్ వేసిన కోడి గుడ్లను పంపిణీ చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు కోడిగుడ్లపై కలర్లు ముద్రిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు వీటికి ఎన్నికల రంగును జగన్ సర్కారు జోడించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైఎస్సార్ ఎస్పీ లోగో ముద్రించిన కోడిగుడ్లు అంగన్వాడీలకు సరఫరా అవుతుండగా, మరి కొన్ని జిల్లాల్లో ఆగస్టు నుంచి ఎస్సార్ ఎస్పీ లోగోను ముద్రించిన కోడిగుడ్లనే సరఫరా చేయనున్నట్లు తెలిసింది.
అంగన్వాడీలకు సరఫరా చే సే కోడిగుడ్లు పక్కదోవ పట్టకుండా ఉండేందుకు టీడీపీ ప్రభుత్వం ఐసీడీఎస్ ఏపీ అని కోడిగుడ్లపై ముద్రించేది. దీనికి భిన్నంగా జగన్ అంగన్వాడీలకు వెళ్లే గుడ్లపై తన, తన తండ్రి పేర్లు కనిపించేలా డిజైన్ చేసి పంపిణీ చేస్తున్నారు.