పాఠశాలలకు ఐఎఫ్పీ ప్యానళ్ళు
ABN , First Publish Date - 2023-06-26T01:15:14+05:30 IST
‘తరగతి గదుల్లో ఉన్న గ్రీన్‌బోర్డులు తొలగించి ఐఎఫ్‌పీ ప్యానల్ /స్మార్ట్‌టీవీలు ఇన్‌స్టాల్ చేయండి.
లక్షలు వెచ్చి ఏర్పాటుచేసిన గ్రీన్‌బోర్డుల తొలగింపు
పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల వింత చర్యలు
టీవీల పరిరక్షణ బాధ్యత హెచ్‌ఎంలదే
విశాఖపట్నం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):
‘తరగతి గదుల్లో ఉన్న గ్రీన్‌బోర్డులు తొలగించి ఐఎఫ్‌పీ ప్యానల్ /స్మార్ట్‌టీవీలు ఇన్‌స్టాల్ చేయండి. ప్రభుత్వం పంపిన ఐఎఫ్‌పీ ప్యానల్/ స్మార్ టీవీని తిరస్కరించకుండా ప్రతి ప్రధానోపాధ్యాయుడు విధిగా తీసుకోవాలి.
- ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో ఆదేశం.
పాఠశాల విద్యాశాఖ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నవ్వుల పాలవుతుండగా మరికొన్ని తుగ్లక్‌ను పోలినట్టుగా ఉన్నా యనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది కిందట రూ.కోట్లు వెచ్చించి కొనుగోలుచేసిన గ్రీన్‌బోర్డులను పక్కన పడేసి పాఠశాలల్లో కొత్తగా ఐఎఫ్‌పీప్యానల్/ స్మార్ట్‌టీవీలు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం నవ్వుల పాలవుతోంది. ఏడాది క్రితమే నాడు-నేడు పథకం నిధులతో కొనుగోలుచేసిన గ్రీన్‌బోర్డులు ప్రస్తుతం స్టోర్‌రూమ్‌కు తరలిపోనున్నాయి. కాగా ప్రస్తుతం అమర్చనున్న స్మార్ట్ టీవీల స్థానంలో వచ్చే ఏడాది ఇంకేమి తెస్తారోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాపరిషత్, ప్రభుత్వ, మునిసిపల్ ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో నాడు-నేడు కింద గత ఏడాది గ్రీన్‌బోర్డులు ఏర్పాటుచేశారు. ఎనిమిది అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో చుట్టూ స్టీల్ కోటెడ్‌తో గ్రీన్‌చాక్‌బ ోర్డులు ప్రతి తరగతి గదిలో అమర్చారు. ఇవి పాఠ్యాంశాల బోధనకు సౌలభ్యంగా ఉంటాయని భావించిన ఉన్నతాధికారులు ప్రతి గ్రీన్‌బోర్డుకు రూ.10,300 వెచ్చించి కొనుగోలుచేశారు. ఏడాది గడవక ముందే గ్రీన్‌బోర్డులపై ప్రభుత్వానికి మోజు తీరిపోయింది. వాటి స్థానంలో ఐఎఫ్‌పీ ప్యానళ్లు/ స్మార్ట్‌టీవీలు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించి, ఒక్కోటి రూ.మూడు లక్షలు వెచ్చించి కొనుగోలుచేసి పాఠశాలలకు పంపేశారు. ఖరీదైనప్యానళ్లు/ స్మార్ట్‌టీవీల ద్వారా బోధన సాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయంతో ఆన్‌లైన్‌లో లభించిన బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులకు అందించాలని స్పష్టంచేసింది. ఆన్‌లైన్‌లో బోధన అందించలేని సందర్భాల్లో మార్కర్‌తో ప్యానల్‌పై తరగతులు బోధించవచ్చునని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిన ఆదేశాలలో పేర్కొంది. ఐఎఫ్‌పీ ప్యానళ్లు/స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేసే సమయంలో తరగతి గదుల్లో ఉన్న గ్రీన్‌బోర్డులు తొలగించాలని ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆశ్చర్యపోతున్నారు.
ఏడాదికే మూలకు...
ఏడాది క్రితం ప్రభుత్వం సరఫరాచేసిన గ్రీన్‌బోర్డులు బోధనకు వీలుగా ఉన్నాయని కొందరు హెచ్‌ఎంలు ప్రశ్నించినా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వాటిని తొలగించి ఐఎఫ్‌పీ ప్యానళ్లు బిగించాలని స్పష్టంచేశారు. దీంతో జిల్లాలో పలు ఉన్నత పాఠశాలలకు వచ్చిన ఐఎఫ్‌పీ ప్యానళ్ల ఏర్పాటుకు హెచ్‌ఎంలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 50 గదులున్న చంద్రంపాలెం, 25 గదులున్న తోటగరువు, గాజువాక, నడుపూరు, పెందుర్తి, ఆనందపురం, గోపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రీన్‌బోర్డులకు లక్షలు వెచ్చించారని, ఉన్నతాధికారుల నిర్ణయంతో ఇప్పుడు అవి స్టోర్‌రూమ్‌లు పరిమితం కానున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో పాఠశాల విద్యాశాఖ ముందు వరుసలో ఉంటుందని, దీనికి నాడు-నేడులో చేపడుతున్న వివిధ రకాల పనులే నిదర్శమని మండిపడుతున్నారు. కాగా తరగతి గదుల నుంచి తొలగించిన గ్రీన్‌బోర్డులను నాడు-నేడు కింద పనులు చేపట్టని పాఠశాలల్లో బిగించనున్నారు. ఐఎఫ్‌పీ ప్యానళ్లు ఏర్పాటుచేసిన గదుల్లో ప్యానళ్లకు ఇరువైపులా చిన్నసైజులో గ్రీన్‌బోర్డులు ఏర్పాటుచేస్తామని ఇందుకు అవసరమైన బోర్డులు త్వరలో సరఫరా చేస్తామంటున్నారు.
రక్షణ బాధ్యత హెచ్‌ఎంలదే..
కాగా పాఠశాలల్లో అమర్చే స్మార్‌టీవీలు, ప్యానళ్ల రక్షణ బాధ్యత ప్రధానోపాధ్యాయుకే అప్పగించారు. పాఠశాలకు నైట్ వాచ్‌మన్ ఉన్నా అన్ని గదుల్లో ప్యానళ్లు పాడవకుండా కాపాడుకోవడం కష్టమేనని పలువురు హెచ్‌ఎంలు అంటున్నారు. కొన్నిచోట్ల పిల్లలు తరగతి గదుల్లో ఫ్యాన్లు విరగ్గొడం, లైట్లు కొట్టేయడం, ఆవరణలో ట్యాప్‌లు తొలగిస్తున్న ఘటనలున్నాయంటున్నారు. తరగతి టీచర్‌లేనప్పుడు పొరపాటున ఏ విద్యార్థి అయినా ప్యానల్‌ను కొట్టినా పాడుచేసినా మొత్తం సొమ్ము హెచ్‌ఎం జేబు నుంచి చెల్లించాల్సిందేనని వాపోతున్నారు.