మండిన అనకాపల్లి
ABN , First Publish Date - 2023-04-15T01:32:44+05:30 IST
తీవ్ర వడగాడ్పులకు శుక్రవారం అనకాపల్లి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. విశాఖ, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల గాడ్పులు వీస్తున్నా అనకాపల్లిలో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎండలకు తోడు తీవ్ర వడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గడచిన ఐదు రోజుల నుంచి రాష్ట్రంలోనే ఎక్కువగా అనకాపల్లి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పులు వీస్తున్నాయి.

23 మండలాల్లో వడగాడ్పులు
మునగపాకలో 42.5 డిగ్రీలు నమోదు
మరో నాలుగు రోజులు గాడ్పుల ప్రభావం
విశాఖ ఎయిర్‌పోర్టులో 41.4 డిగ్రీలు
విశాఖపట్నం/ అనకాపల్లి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వడగాడ్పులకు శుక్రవారం అనకాపల్లి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. విశాఖ, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల గాడ్పులు వీస్తున్నా అనకాపల్లిలో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎండలకు తోడు తీవ్ర వడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గడచిన ఐదు రోజుల నుంచి రాష్ట్రంలోనే ఎక్కువగా అనకాపల్లి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉత్తర కోస్తాలో ఎండలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం అనకాపల్లి జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 11 మండలాల్లో గాడ్పులు వీచాయి. అనకాపల్లి, మునగపాక, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నాతవరం, రావికమతం, ఎస్.రాయవరం, బుచ్చెయ్యపేట, నర్సీపట్నంలో తీవ్ర వడగాడ్పులు వీచాయి. అత్యధికంగా మునగపాకలో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రానున్న నాలుగు రోజులు ఉత్తర కోస్తాలో గాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం అనకాపల్లి జిల్లాలో ఐదు మండలాల్లో తీవ్రగాడ్పులు, 12 మండలాల్లో గాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఎయిర్‌పోర్టులో 41.4 డిగ్రీలు
ఎండలకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వరుసగా ఐదో రోజు ఎండ తీవ్రత కొనసాగింది. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నగరంలో వడగాడ్పులు వీచాయి. ఎయిర్‌పోర్టులో ఈ సీజన్‌లో తొలిసారిగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే ఏకంగా 6.1 డిగ్రీలు ఎక్కువని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు 36 డిగ్రీలు, 11.30 గంటలకు 38, మధ్యాహ్నం 12.30 గంటలకు 39, 1.30 గంటలకు 41.4 డిగ్రీలు నమోదైనట్టు పేర్కొంది. అయితే మధ్యాహ్నం మూడు గంటల తరువాత సముద్ర గాలులు వీయడంతో నగరంలో ఎండ తీవ్రత క్రమేపీ తగ్గి సాయంత్రానికి అనేక ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. కాగా పొరుగునున్న ఒడిశాలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నందున ఆ ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై పడింది. మరో నాలుగు రోజులు నగరంలో ఎండలు కొనసాగుతాయని, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావం వుంటుందని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు. కాగా ఎయిర్‌పోర్టులో గడచిన ఐదు రోజులగా నమోదైన ఉష్ణోగ్రతలవివరాలు
వడగాడ్పులతో అల్లాడిన జనం
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 14: అనకాపల్లిలో శుక్రవారం అధిక ఉష్ణోగ్రతతోపాటు వడగాడ్పులు వీయడంతో జనం అల్లాడిపోయారు. ఉదయం ఏడు గంటల నుంచే ఉష్ణతాపం మొదలైంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. ఉదయం పది గంటలకే నెహ్రూచౌక్, మెయిన్‌రోడ్డు, రింగురోడ్డు, ఎన్టీఆర్ వైద్యాలయం రోడ్డు, పూల్‌బాగ్‌రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, చిననాలుగురోడ్ల జంక్షన్ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్ర నాలుగు గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వాహనాల్లో ప్రయాణించే వారు వడగాడ్పులతో ఇబ్బంది పడ్డారు. పలువురు వ్యాపారులు మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలను మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. సాయంత్రం ఐదు గంటల తరువాత షాపులను తిరిగి తెరిచారు. ఫుట్‌పాత్ వ్యాపారులు ఉదయం పది గంటలకే దుకాణాలను సర్దేసుకున్నారు. కాగా సోడాలు, కూల్ డ్రింక్స్, చెరకు రసం, ఐస్‌క్రీమ్, పండ్ల రసాల వ్యాపారులు ఊపందుకున్నాయి.