Pawan Kalyan: మరో మూడు రోజుల వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు.. ఈసారి ఎక్కడంటే..

ABN , First Publish Date - 2023-08-04T11:38:43+05:30 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మూడో దశ వారాహి యాత్ర విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగిరిలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ ఈ విషయం వెల్లడించారు.

Pawan Kalyan: మరో మూడు రోజుల వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు.. ఈసారి ఎక్కడంటే..

విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మూడో దశ వారాహి యాత్ర విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగిరిలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ ఈ విషయం వెల్లడించారు.

ఈ నెల పది నుంచి 19వ తేదీ వరకు పవన్‌కల్యాణ్‌ విశాఖపట్నంలోనే ఉంటారు. అందుకు ఏర్పాట్లు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నాయకులతో ఆయన చర్చించారు. ఈ పర్యటన మొత్తం అర్బన్‌ ఏరియాలోనే అంటే...జీవీఎంసీ పరిధిలోనే ఉంటుంది. పదో తేదీన బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తరువాత మరో రెండు బహిరంగ సభలు ఉంటాయి. ప్రతిరోజూ ఒక కార్యక్రమం ఉంటుంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చిన భూములన్నింటినీ పవన్‌ కల్యాణ్‌ సందర్శిస్తారు. దసపల్లా భూములు, పెందుర్తి మండలం ముదపాక, అనకాపల్లి జిల్లాలో బయ్యవరం, విస్సన్నపేట...ఇలా అనేక ప్రాంతాలు ఆ జాబితాలో ఉన్నాయి. సీఎన్‌బీసీ చర్చి భూములు, ఎర్రమట్టి దిబ్బలు, రుషికొండలను కూడా ఆయన పరిశీలిస్తారు. నగర కాలుష్యంపై ఆయన మాట్లాడతారు. స్టీల్‌ప్లాంటు సమస్యపై కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తారు. గంగవరం పోర్టు పెడుతున్న ఇబ్బందులను కూడా పరిశీలిస్తారు.

వార్డు, గ్రామ వలంటీర్ల ఆగడాలకు బలైపోయిన కుటుంబాలను పరామర్శిస్తారు. ఇందులో భాగంగా సుజాతనగర్‌ వెళతారు. చిన్న పరిశ్రమల మూత, రోడ్డున పడుతున్న కార్మికులు, పరిశ్రమలకు అందని ప్రోత్సాహకాలు, ఫెర్రో అల్లాయిస్‌ సమస్యలు వంటి అంశాలపై సంబంధిత వర్గాలతో చర్చిస్తారు. అలాగే ‘జనవాణి’ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. విశాఖపట్నం వచ్చిన తరువాత మరికొన్ని కార్యక్రమాలపై దృష్టిపెడతారు. నాదెండ్ల మనోహర్‌ నిర్వహించిన సమావేశంలో కోన తాతారావు, శివశంకర్‌, బొలిశెట్టి సత్య, పంచకర్ల రమేశ్‌బాబు, సందీప్‌, ఉషారాణి, పరుచూరి భాస్కరరావు, పీవీఎస్‌ఎన్‌ రాజు, ఎస్‌.విజయకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-04T11:46:44+05:30 IST