వైసీపీది దుర్మార్గపు పాలన
ABN , First Publish Date - 2023-06-29T01:51:46+05:30 IST
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలందరూ వైసీపీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ తలపెట్టిన బస్సు యాత్ర బుధవారం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సాగింది. ఈ సందర్భంగా శ్రీహరిపురం జీవీఎంసీ వాకర్స్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పాలి
పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేతల బస్సు యాత్ర
రాష్ర్టాన్ని అధోగతి పాల్జేసిన జగన్‌రెడ్డి: బండారు
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం
ఏడాదిలో ఎనిమిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు: ఎమ్మెల్యే గణబాబు
టీడీపీ హయాంలో పూర్తిచేసిన ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకపోవడం దుర్మార్గం
అప్పులతో రాష్ట్రం సర్వనాశనం: పల్లా
దళితులపై పెరిగిపోయిన దాడులు: అనిత
చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఒక భరోసా: ఎమ్మెల్సీ దువ్వారపు
జగన్ పాలనతో భావితరాలకు నష్టం: ఎమ్మెల్యే వేపాడ
మల్కాపురం, జూన్ 28:
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలందరూ వైసీపీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ తలపెట్టిన బస్సు యాత్ర బుధవారం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సాగింది. ఈ సందర్భంగా శ్రీహరిపురం జీవీఎంసీ వాకర్స్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత వేదికపై ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెత్త ద్వారా సంపదను సృష్టిస్తే...జగన్‌రెడ్డి చెత్తపై పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సెంటు భూమిలో నిర్మిస్తున్న ఇళ్లు కాపురం ఉండడానికి పనికిరావన్నారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయని, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసి, తాను మాత్రం రూ.వేల కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమన్నారు. సభకు అధ్యక్షత వహించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ రాష్ట్రం ప్రస్తుతం అంధకారంలో ఉందన్నారు. నాడు చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను నిలిపివేశారని, దాంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలైన మేనిఫెస్టో ఎన్నికల ముందు విడుదల చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ ఏడాదిలో ఎనిమిదిసార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నెత్తిన పెనుభారం మోపారని విమర్శించారు. అన్ని రకాల ధరలు బాగా పెరిగిపోయాయన్నారు. తన నియోజకర్గంలో దాదాపు ఏడు వేల ఇళ్లును చక్కగా నిర్మించడం జరిగిందని, ఆ ఇళ్లను ఇప్పటివరకు కూడా ప్రజలకు అందించలేదంటే ఆయన ఎంతటి దుర్మార్గుడో అర్థం చేసుకోవాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అప్పులు తెచ్చి వాటిపై సంపద సృష్టించి ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తే...ఈ ముఖ్యమంత్రి అప్పులు తెచ్చి అంతా నాశనం చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళిత, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పోయాయన్నారు. మంత్రులే అభద్రతతో ఉన్నారని, అందుకే గన్ లైసెన్స్ కోరుతున్నారని, దీనిని బట్టి చూస్తే వైసీపీ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. గంజాయి విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపద సృష్టించి ఆ ఫలాలను ప్రజలకు అందిస్తారని, అదే జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాల్జేసి భావితరాలకు నష్టపరిచే విధంగా పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మరో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఒక భరోసా అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు 70 శాతం పూర్తిచేస్తే, మిగిలిన 30 శాతం పనులను జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేయకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సంపాదన సృష్టించాలంటే అది చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, గండి బాబ్జీ, భీమిలి నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి కోరాడ రాజాబాబు, పుచ్చ విజయ్‌కుమార్, 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, నాయకులు కోరాడ శ్రీనివాసరావు, పొత్తబత్తుల శ్రీను, మజ్జి సోమేష్, మజ్జి మాలినాయుడు, కార్పొరేటర్ బొమ్మిడి రమణ, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా టీఎన్‌టీయుసీ అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు వందన సమర్పణ చేశారు.
బస్‌యాత్ర విజయవంతం
తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైంది. తొలుత ములగాడ జంక్షన్ సమీపంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు (గణబాబు) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాజువాక ఆర్టీసీ డిపో ప్రాంగణంలో వున్న అంబేడ్కర్ విగ్రహానికి నాయకులందరు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాజువాక ఆర్టీసీ డిపో నుంచి మల్కాపురం మరిడిమాంబ ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగించారు. ఈ యాత్ర ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగింది. యాత్రలో పాల్గొన్న నాయకులందరికీ మహిళలు ఘనస్వాగతం పలికారు.
ఫోటో28ఎంఎల్‌కేపీపీ 1, 2: సెల్పీ చాలెంజ్ చేస్తున ఎ మ్మెల్యే గణబాబు
వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన అన్న క్యాంటీన్‌ల వద్ద, అలాగే జనతా కాలనీ నుంచి మల్కాపురం మరిడిమాంబ ఆలయం వరకు కోట్లాది రూపాయలతో నిర్మించిన గెడ్డ వద్ద తెలుగుదేశం నాయకులు ఫొటోలు తీసుకొని సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. అలాగే సింథియా నుంచి జింక్ గేటు వరకు సుందరమైన రహదారి, మధ్యన డివైడర్‌పై పచ్చటి చెట్లను వేసి ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దితే..ఇప్పుడు వాటిని నరికివేశారని గణబాబు పేర్కొన్నారు. ఆ మార్గంలో కూడా సెల్ఫీ తీసుకుని ఛాలెంజ్ చేశారు.