జోరుగా పండుగప్ప సాగు
ABN , First Publish Date - 2023-04-21T00:20:39+05:30 IST
పండుగప్ప సాగు లాభదాయకంగా ఉండడంతో ఉప్పుటేరు తీర గ్రామాల్లో ఆక్వా రైతులు జోరుగా పండుగప్ప సాగు చేస్తున్నారు.

కలిదిండి, ఏప్రిల్ 20 : పండుగప్ప సాగు లాభదాయకంగా ఉండడంతో ఉప్పుటేరు తీర గ్రామాల్లో ఆక్వా రైతులు జోరుగా పండుగప్ప సాగు చేస్తున్నారు. పండుగప్ప ధర భారీగా పెరిగింది. కిలో రూ.520 పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధర లభించడంతో రైతులు పండుగప్ప పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో పండుగప్ప సాగు చేస్తున్నారు. కొల్లేరు ప్రాంతంలోను పండుగప్ప సాగు విస్తరించారు. ఎకరానికి ఖర్చులు పోను రూ.3 లక్షలు వరకు ఆదాయం వస్తోంది. పండుగప్ప మాంసాహారం మాత్రమే తింటుంది. దీంతో వీటికి చైనా గురక పిల్లలను ఆహారంగా వేస్తున్నారు. కొల్లేరు ప్రాంతంలోని చెరువుల్లో చేప పిల్లలను వ్యాన్లపై దిగుమతి చేసుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో పండుగప్ప పట్టుబడికి వస్తోంది. ఒక్కొ పండుగప్ప కిలో నుంచి ఐదు కిలోల వరకు పెంచుతున్నారు. సాధారణ రకానికి చెందిన శీలావతి, బొచ్చె, ఫంగస్‌లు కిలో రూ.100 ఉండగా, పండుగప్ప ధర వీటి కంటే నాలుగు రెట్లు అఽధికంగా ఉండడంతో రైతులు పండుగప్ప పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. రొయ్యల చెరువులను సైతం పండుగప్ప చెరువులుగా మార్పు చేసి సాగు చేస్తున్నారు. పండుగప్ప పెంపకంలో ఒడిదుడుకులు ఉన్నాయి. చెరువులో ఆక్సిజన్ కొరత ఏర్పడి మృత్యువాత పడితే లక్షలాది రూపాయల నష్టం తప్పదు. పెద్ద పండుగప్పలు చిన్న వాటిని తినేయడంతో దిగుబడి తగ్గి నష్టాలు వస్తాయి. ఉప్పునీటి లోను పండుగప్ప పెరగడంతో ఉప్పుటేరు తీర గ్రామాల్లో అధికంగా పెంచుతున్నారు. సముద్ర తీర గ్రామాలైన చిన్న గొల్లపాలెం, నిడమర్రు, పెదపట్నం, మచిలీపట్నం నుంచి పండుగప్ప చేపల పిల్లలను దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కొక్క పిల్ల ధర రూ.50 నుంచి 70 వరకు ఉంటుంది. ఎకరానికి 500 నుంచి వెయ్యి వరకు పిల్లలను వేస్తున్నారు. పట్టుబడి చేసిన పండుగప్పలను థర్మాకోల్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి కోల్‌కత్తా, ఒడిశా, ముంబై, పుణే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఈ పండుగప్పకు గిరాకీ ఉంది.
పండుగప్ప ఫీడ్ కంపెనీలను ఏర్పాటు చేయాలి
పండుగప్ప ఫీడ్ తయారీ కంపెనీలను ఏర్పాటు చేయాలి. థాయ్‌లాండ్‌తో ఫిల్లెట్ కంపెనీ ఉంది రాష్ట్రంలో ఫిల్లెట్ అందు బాటులో లేకపోవడంతో చైనా గురక పిల్లలను ఆహారంగా వేస్తున్నారు. పలుమార్లు గురక పిల్ల కొరత ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రూ.20 ఉండగా, ప్రస్తుతం రూ.50 పలకడంతో మేత ఖర్చు అధికమవుతోంది. పండుగప్ప సాగులో ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. సముద్రతీర ప్రాంతాల్లో పండుగప్ప హేచరీలు ఏర్పాటు చేస్తే నాణ్యమైన సీడ్ దొరుకుతుంది.
– అండ్రాజు దుర్గారావు, ఆక్వా రైతు