మంత్రిగా ఐదు వేళ్లతో తినేది అన్నమేగా.. గడ్డి కాదు కదా?.. అంబటిని నిలదీసిన వైసీపీ ఎంపీటీసీ

ABN , First Publish Date - 2023-01-27T20:15:08+05:30 IST

పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేసిందెవరో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు తెలియదా?.. అంబటి ఐదు వేళ్లతో అన్నమేగా తింటుంది? గడ్డి కాదు కదా...

మంత్రిగా ఐదు వేళ్లతో తినేది అన్నమేగా.. గడ్డి కాదు కదా?.. అంబటిని నిలదీసిన వైసీపీ ఎంపీటీసీ

సత్తెనపల్లి: ‘పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేసిందెవరో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు తెలియదా?.. అంబటి ఐదు వేళ్లతో అన్నమేగా తింటుంది? గడ్డి కాదు కదా?..’ అంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sattenapalle) మండలం పెద్దమక్కెన గ్రామ వైసీపీ ఎంపీటీసీ (MPTC) యాంపాటి విజయలక్ష్మి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం గ్రామంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీటీసీకి ప్రాధాన్యత ఇవ్వక పోవటంతో హెచ్‌ఎంతో వాగ్వివాదానికి దిగారు. అనంతరం శుక్రవారం ఆమె మీడియా ఎదుట తన గోడును వెళ్లబోసుకున్నారు. పార్టీ కోసం పని చేయని వారు గ్రామంలో పెత్తనం చెలయిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో అంబటి గెలుపునకు తన భర్త కోటిరెడ్డి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా రూ.30 లక్షలు వరకు ఖర్చు పెట్టామన్నారు.

కానీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీటీసీనైన తనకు, తన భర్తకు విలువ లేకుండా పోయిందని పోయారు. అభివృద్ధి పనుల నుంచి గ్రామంలో పెత్తమంతా పార్టీ మండల కన్వీనర్‌ రాయపాటి పురుషోత్తమరావు, నాయకుడు కళ్లం విజయ భాస్కర్‌రెడ్డి (Vijaya Bhaskar Reddy)లే చేస్తున్నారని మండిపడ్డారు. తమ గ్రామంలో వారి పెత్తనం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ విషయాలన్నీ మంత్రి అంబటికి తెలియదా?.. ఆయన ఎందుకు స్పందించటం లేదు?.. ఐదేళ్లతో అన్నమేగా తింటుంది’ అని విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పనికి వచ్చిన తన భర్త ఈ రోజు పనికి రావటం లేదా? అని ప్రశ్నించారు. మా పనులు కానప్పుడు ఈ పదవి మాకెందుకు అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం మెడలో పుస్తెలు తన భర్త గొలుసు, ఉంగరాలు కూడా తాకట్టు పెట్టామని వాపోయారు. పిల్లలను చదివించుకుందామన్నా తమ వద్ద చిల్లు గవ్వ కూడా లేదని విజయలక్ష్మి విలపించారు.

Updated Date - 2023-01-27T20:16:40+05:30 IST