Philips: 6 వేల మంది ఉద్యోగులపై వేటు.. కారణం ఇదే!
ABN , First Publish Date - 2023-01-30T15:54:34+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఇటీవల ఒక రకమైన అలజడి

ది హేగ్: ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఇటీవల ఒక రకమైన అలజడి నెలకొంది. కంపెనీలన్నీ ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తూ ఊచ‘కోత’ కోస్తున్నాయి. ఇప్పటికే ఈ సంఖ్య వేలు దాటేసింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) ట్విట్టర్(Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత మొదలైన ఈ తొలగింపు పర్వం ఆ తర్వాత దాదాపు అన్ని కంపెనీలకు పాకింది. అమెజాన్(Amazon) నుంచి ‘సేల్స్‌ఫోర్స్’(Salesforce) వరకు ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఇంకొన్ని కంపెనీలు కూడా అదే బాటన నడుస్తున్నాయి. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం, ఖర్చులు అమాంతం పెరిగిపోవడం వంటి కారణాలను చూపుతూ ఉద్యోగులను బయటకు గెంటేస్తున్నాయి.
తాజాగా, ఈ జాబితాలోకి కష్టాల్లో కూరుకుపోయిన డచ్ మెడికల్ టెక్ మేకర్ ఫిలిప్స్(Philips) కూడా చేరింది. స్లీప్ రెస్పిరేటర్ల(Sleep Respirators)ను వెనక్కి పిలిపించిన తర్వాత ఏర్పడిన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఫిలిప్స్ ప్రకటించింది.
కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాకోబ్స్( Roy Jakobs) మాట్లాడుతూ.. బాధాకరమే అయినా, 2025 నాటికి మరిన్ని కోతలు తప్పవని తేల్చేశారు. 400 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించిన మూడు నెలల తర్వాతే తాజా ప్రకటన రావడం గమనార్హం. ఫిలిప్స్‌కు, తమ వాటాదారులకు 2022 చాలా కఠిన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు.
ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఫిలిప్స్ 2022 నాలుగో త్రైమాసికంలో ఏకంగా 105 మిలియన్ యూరోల (114 మిలియన్ డాలర్లు) నికర నష్టాన్ని చవిచూసింది. స్లీప్ రెస్పిరేటర్ల రీకాల్ కారణంగా గతేడాది మొత్తంగా 1.6 బిలియన్ యూరోలు నష్టపోయింది. స్లీప్ అప్నియా(Sleep Apnoea)తో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స చేసేందుకు ఉపయోగించే స్లీప్ రెస్పిరేటర్లలో లోపాల కారణంగా 2021లో వాటిని వెనక్కి తీసుకుంది. ఫలితంగా భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. సౌండ్ డంపెనింగ్ ఫోమ్ ముక్కలను పీల్చడం ద్వారా రోగులు విషపూరిత, క్యాన్సర్ కారక ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉండడంతో ఫిలిప్స్ వాటిని రీకాల్ చేసింది.
పనితీరును మెరుగుపరుచుకోవడం, ఉత్పాదకతను పెంచేందుకు తమ పని విధానాన్ని మరింత సరళతరం చేయాలని భావిస్తున్నట్టు జాకోబ్ వివరించారు. ఉద్యోగాలను తొలగించడం బాధాకరమే అయినా తప్పడం లేదన్న ఆయన 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6 వేల మందిని తొలగించడం తప్పనిసరని అన్నారు. ఈ ఏడాది 3,000 వేలమందిని తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.
130 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఫిలిప్స్‌లో ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. లైటింగ్ కంపెనీగా ప్రారంభమైన ఫిలిప్స్ ఆ తర్వాత ‘హై ఎండ్ ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్’ ఉత్పత్తులపై దృష్టి సారించింది.