Vasati divena: సంక్షేమ క్యాలెండర్‌కు గండి! విద్యార్థులకు ఇచ్చేందుకు పైసల్లేవు!

ABN , First Publish Date - 2023-04-19T11:34:00+05:30 IST

జగన్‌ సర్కారు ఘనంగా చెప్పుకొన్న సంక్షేమ క్యాలెండర్‌కు తొలి నెలలోనే గండి పడింది. ఈ నెలలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేస్తామని గొప్పగా చెప్పుకొన్నారు

Vasati divena: సంక్షేమ క్యాలెండర్‌కు గండి! విద్యార్థులకు ఇచ్చేందుకు పైసల్లేవు!
Vasati divena

ఖజానాలో సొమ్ముల్లేవు.. వసతి దీవెన వాయిదా

సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రకటన

ఇప్పుడే ఎందుకీ బీద అరుపులు?

నాలుగేళ్లలో డబ్బులు ఎప్పుడున్నాయ్‌!

పథకాలు ఎగ్గొట్టే మాస్టర్‌ ప్లానా?

జనాలను ముందే సిద్ధం చేస్తున్నారా?

కేంద్రం, బ్యాంకులు అప్పులివ్వకపోతే

పథకాలిచ్చే పరిస్థితి లేదు!

అస్తవ్యస్త నిర్ణయాలతో గల్లాపెట్టె ఖాళీ

బటన్‌ నొక్కినా సొమ్ము పడడం లేదు

నిరుటి విద్యాదీవెన డబ్బులు

నేటికీ చాలా ఖాతాల్లో జమ కాలేదు!

జగన్‌ సర్కారు ఘనంగా చెప్పుకొన్న సంక్షేమ క్యాలెండర్‌కు తొలి నెలలోనే గండి పడింది. ఈ నెలలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేస్తామని గొప్పగా చెప్పుకొన్నారు. కానీ... డబ్బుల్లేవంటూ ఇప్పుడు చేతులెత్తేశారు. వసతి దీవెన పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి నాలుగేళ్లుగా ఎప్పుడూ సర్కారు వద్ద డబ్బుల్లేవు. అప్పులతో బండి లాక్కొస్తున్నారు. ఇప్పుడు అప్పులూ పుట్టడం లేదా? పథకాలు అటకెక్కించేస్తారా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Andhra Pradesh)లో వసతి దీవెన పథకం అమలు వాయిదా పడింది. ఏప్రిల్‌ నెలలో ఆదాయ వనరుల సమస్యలు ఉంటాయని.. ఆశించిన మొత్తాలు రాకపోవడం వల్ల షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక లోటు సమస్యలుంటాయని, అయితే రానున్న రోజుల్లో సంక్షేమ క్యాలెండర్‌ అమలుకు నిధుల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా.. కష్టపడి అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని నాలుగేళ్లుగా జగన్‌ ప్రభుత్వం (Jagan Government) గొప్పలు చెప్పుకొంటోంది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బుల్లేవు.. అందుకే వసతి దీవెన పథకం వాయిదా వేస్తున్నామని అధికారికంగా ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్లను తెచ్చుకోకపోగా.. కొత్త ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సు అప్పు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్ర ఖజానాకు కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రూ.10,000 కోట్ల గ్రాంట్లు రావలసి ఉంది. కానీ అదే రోజున మరో రూ.3,000 కోట్ల అప్పునకు అనుమతి తెచ్చుకొని వాటిని వాడేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నాలుగేళ్లలో అప్పులు, దొంగ అప్పుల కోసం ఢిల్లీలో లాబీయింగ్‌ చేయడం తప్పితే.. విభజన చట్టం ద్వారా రావలసిన నిధులు, కేంద్ర పథకాల గ్రాంట్ల కోసం ఏనాడూ చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాల్లేవు. ఆదాయం పెంచుకోవడానికి జనాల జేబులు మాత్రం గుల్ల చేస్తోంది. ఆస్తిపన్ను పెంపు, మరుగుదొడ్ల పన్ను, చెత్త పన్ను, వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌).. ఇవి చాలవన్నట్లు ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు వ్యాట్‌, రోడ్డు సెస్‌ బాదుతున్నారు.

వ్యాపారావకాశాలను దెబ్బతీసి..

రాష్ట్రంలో అందరికీ సమాన వ్యాపారావకాశాలు కల్పించి ఉంటే ఖజానా ఆదాయం ఈ ఏడాది మరో రూ.30,000 కోట్లు పెరిగేది. అలా కాకుండా జగన్‌ సర్కారు సొంత జేబులు నింపుకోవడం కోసం రాష్ట్రంలో వ్యాపార అవకాశాలను దెబ్బతీసింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం, వ్యాపార అవకాశాలను విస్తృతంగా అందరికీ అందుబాటులోకి తేకపోవడం రాష్ట్ర ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రభుత్వం ప్రతి నెలలో 20 రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాఫ్టు(ఓడీ)లో ఉంటోంది. ఇంచుమించు నాలుగేళ్ల నుంచీ రాష్ట్ర ఖజానాకు ఇదే దుస్థితి.

బటన్‌ నొక్కినా పడవేం?

జగన్‌ బటన్‌ నొక్కిన వెంటనే లబ్ధిదారులందరికీ ఖాతాల్లో డబ్బులు పడిపోవడం లేదు. బటన్‌ నొక్కి నెలలు గడుస్తున్నా సాయం అందనివారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు మార్చి చివరి వారంలో ఆసరా పథకం కోసం సీఎం బటన్‌ నొక్కారు. ఇప్పటికీ ఆసరా డబ్బులు ఖాతాల్లో పడని లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు. పైగా ఈ పథకాన్ని పండుగలాగా పది రోజుల పాటు నిర్వహిస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. బటన్‌ నొక్కగానే పడాల్సిన డబ్బులను పది రోజుల పాటు సాగదీయాల్సి వచ్చింది. ఎందుకంటే డబ్బుల్లేవు. ఈ కారణం చెప్పకుండా పది రోజుల పండుగంటూ ఆర్భాటానికి పోయారు. విద్యాదీవెన పథకం కోసం గతేడాది సీఎం బటన్‌ నొక్కితే.. ఇప్పటికీ చాలా మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బు జమ కాలేదు. ఖజానాలో చిల్లిగవ్వ లేని సమయంలో కూడా సీఎం చాలాసార్లు బటన్‌ నొక్కారు. అప్పుడు ఆర్‌బీఐ నుంచి వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓడీ అప్పులు తెచ్చి విద్యాదీవెన పథకానికి వాడారు. ఇప్పుడు కూడా ఆర్‌బీఐ వద్ద ఓడీకెళ్లి అప్పు తెచ్చి వసతి దీవెన బటన్‌ నొక్కే అవకాశం ఉంది. కానీ ఆ పని ఎందుకు చేయడం లేదు?

బ్యాంకులు ఆచితూచి..!

నాలుగేళ్ల నుంచి ఖజానా కరువులోనే ఉంది. జగన్‌ సర్కారు ఇన్నాళ్లూ దాచిపెట్టి ఇప్పుడే ఈ సమస్యను పెద్దదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఏపీకి రూ.3,000 కోట్ల కొత్త అప్పునకు అనుమతిచ్చింది. ఇంకా రూ.50,000 కోట్ల కొత్త అప్పులకు అధికారికంగా అనుమతి వస్తుందని రాష్ట్రం ఎదురుచూస్తోంది. ఈ ఏడాది బ్యాంకులు కూడా ఇంకా అప్పులివ్వలేదు. ఈ నెల 18వ తేదీ వచ్చినా రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంకా రూ.500 కోట్ల మేర పెన్షన్లు బాకీ ఉంది. ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి వేస్‌ అండ్‌ మీన్స్‌ అప్పు తెచ్చి వాడేశారు. ఓడీ అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రతి నెలా జరిగే తంతే ఇది. అయినా ఇప్పుడే కొత్తగా ఖజానాలో డబ్బుల్లేవని కొత్తరాగం అందుకోవడం వింతగానే ఉంది. అప్పు తేకుండా పథకాలు అమలు చేయలేని స్థితి నెలకొంది. ఎన్నికల ఏడాదిలో కేంద్రం, బ్యాంకులు ఎంతవరకు సహకరిస్తాయన్నది అనుమానమే. దీనిని గ్రహించే సర్కారు వద్ద డబ్బులేదంటూ ప్రజలను ముందుగానే మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు కనబడుతోంది.

కేంద్రం నుంచి ఆగిపోయిన గ్రాంట్లు (రూ.కోట్లలో)

  • కేంద్ర పథకాల గ్రాంట్లు 6,000

  • ఐజీఎస్‌టీ సెటిల్మెంట్‌ 2,000

  • కేంద్ర పన్నుల్లో వాటా 2,000

Updated Date - 2023-04-19T11:34:00+05:30 IST