India-Canada Row: తీరు మార్చుకోని కెనడా ప్రధాని ట్రూడో.. అప్పుడు యూఏఈ, ఇప్పుడు జోర్డాన్.. మళ్లీ అదే పాత పాట!
ABN , First Publish Date - 2023-10-10T19:14:47+05:30 IST
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య తారాస్థాయిలో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణం ఎవరు? అని ప్రశ్నిస్తే.. ఎవ్వరైనా ఠక్కున కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అని చెప్పేస్తారు. ఎందుకంటే.. తనకొచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య తారాస్థాయిలో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణం ఎవరు? అని ప్రశ్నిస్తే.. ఎవ్వరైనా ఠక్కున కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అని చెప్పేస్తారు. ఎందుకంటే.. తనకొచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని అతను ఆరోపణలు చేశాడు కానీ, అందుకు ఆధారాలు మాత్రం చూపించలేదు. ట్రూడో చేసిన నిరాధారోపణల కారణంగానే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు గట్టిగా దెబ్బతిన్నాయి. దీనికితోడు కెనడాలోని భారత దౌత్యాధికారిని కూడా కెనడా ప్రభుత్వం బహిష్కరించడం.. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో.. భారత్ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ట్రూడో ఆరోపణల్ని నిస్సందేహంగా ఖండించిన భారత్.. ఇక్కడున్న కెనడా దౌత్యాధికారిని దేశం నుంచి కెనడాకు తిరిగి పంపింది. కెనడియన్లకు తాత్కాలికంగా వీసా సేవలు ఆపేసింది. అంతేకాదు.. దౌత్యాధికారుల సంఖ్యని కూడా తగ్గించుకోవాలని కెనడాకు ఫిట్టింగ్ పెడుతూ, 40 మంది దౌత్యాధికారుల్ని వెనక్కు పిలిపించుకోవాలని కండీషన్ కూడా పెట్టింది. ఇలా భారత్, కెనడా మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతూనే ఉంది.
ఇలాంటప్పుడు ఎవరైనా.. తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. అంటే.. తాను చేసిన ఆరోపణల కారణంగా వ్యవహారం ఇంతదాకా వచ్చింది కాబట్టి, తామే ఈ సమస్యని పరిష్కరించేలా ట్రూడో చర్యలు తీసుకోవాల్సింది. తాను చేసిన ఆరోపణలకు సరైన సమాచారం అందించడమో లేక చర్చలు జరిపి వివాదం సద్దుమణిగేలా చూడటమో చేయాలి. కానీ.. ట్రూడో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. భారత్‌ని రెచ్చగొట్టాలని తమ ఉద్దేశం కాదని, ఆ దేశంతో మునుపటిలాగే తమ సంబంధాలు బలంగా కొనసాగుతాయని కోరుకుంటున్నామని చెప్తూనే.. ఈ విషయాన్ని మాత్రం నేరుగా భారత్‌తో కాకుండా ఇతర దేశాలతో ట్రూడో చర్చిస్తున్నారు. ఇప్పటికే ట్రూడో ఈ దౌత్య వివాద అంశాన్ని యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్‌తో చర్చించారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం గురించి ఆయనతో చర్చలు జరిపాక.. భారతదేశం గురించి కూడా చర్చించామంటూ ట్విటర్ మాధ్యమంగా ట్రూడో తెలిపారు. చట్టపాలన గురించి మాట్లాడామన్న సూచించాడు. ఇప్పుడు మళ్లీ ఈ దౌత్య వివాదం గురించి జోర్డాన్ రాజు అబ్దుల్లా-II బిన్ అల్-హుస్సేన్‌తో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించడంతో పాటు భారత్ ప్రస్తావనను ట్రూడో తీసుకొచ్చారు.
‘‘ఇజ్రాయెల్ పరిస్థితిపై జోర్డాన్ రాజు అబ్దుల్లా-IIతో చర్చలు జరిపాం. హమాస్ దాడిపై మేము ఆందోళన వ్యక్తం చేశాం. పౌర జీవితాలను రక్షించాల్సిన అవసరం గురించి చర్చించాం. అలాగే కెనడా, భారత్ మధ్య పరిస్థితులపై.. చట్టపాలన ప్రాముఖ్యతపై చర్చలు జరిపాం’’ అంటూ ట్రూడో తన ట్విటర్‌లో పేర్కొన్నారు. న్యాయపాలన, దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్‌ని గౌరవించాలని ట్రూడో నొక్కి చెప్పినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే.. కింగ్ అబ్దుల్లా II కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో మాత్రం భారతదేశం-కెనడా సంబంధాలపై చర్చ గురించి స్పష్టంగా ప్రస్తావించబడలేదు. ఏదేమైనా.. భారత్‌తో వివాదానికి ఆజ్యం పోసినా ట్రూడో, ఈ సమస్యపై నేరుగా భారతదేశంతో చర్చించకుండా ఇతర దేశాల వద్ద ప్రస్తావన తీసుకురావడాన్ని బట్టి చూస్తే.. భారత్ పట్ల అతనికున్న వ్యతిరేక వైఖరని అర్థం చేసుకోవచ్చు.