Nawaz Sharif: కశ్మీర్ అంశం, భారత్‌తో సంబంధాలపై నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు.. బంగ్లాదేశ్‌తో విడిపోకుండా ఉండుంటే..
ABN , First Publish Date - 2023-10-22T19:18:45+05:30 IST
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు. వచ్చి రావడంతోనే తన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు...
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు. వచ్చి రావడంతోనే తన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశం, భారత్‌తో సంబంధాలపై కూడా మాట్లాడారు. ఈసారి ఆయన స్వరం భారత్ పట్ల మృదువుగా మారింది. కశ్మీర్ పరిష్కారం కోసం గౌరవప్రదంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. భారతదేశంతో పాటు ఇతర దేశాలతో సంబంధాలను బలపర్చుకోవాలని నొక్కిచెప్పారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న ఆయన.. మునుపటిలాగా తిరిగి మంచి స్థాయికి చేరుకోవడం కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదే సమయంలో.. తాము బంగ్లాదేశ్‌తో విడిపోకుండా ఉండాల్సిందని నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ బంగ్లాదేశ్‌తో విడిపోకుండా ఇప్పటికీ కలిసి ఉండుంటే.. భారతదేశం గుండా ఎకనామిక్ కారిడార్ ఉండేదని అన్నారు. తాము చాలా బలమైన స్థితిలో ఉండేవాళ్లమన్నారు. పురోగతిలో ఈరోజు పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ పురోగతిలో ముందంజలో ఉందని ఆయన అంగీకరించారు. రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందాలన్న, భిక్షాటన గిన్నెను శాశ్వతంగా పగలగొట్టాలన్నా.. మనకంటూ విదేశాంగ విధానం రూపొందించుకోవాలని చెప్పారు. అలాగే ప్రపంచంతో సత్సంబంధాలు తప్పకుండా ఏర్పరచుకోవాలని పేర్కొన్నారు. తాను మారిన పాకిస్తాన్‌ని చూడాలని కోరుకుంటున్నానని, తన దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు.
సైన్యంపై తాను ప్రతీకారం తీర్చుకోబోనని, దేశాభివృద్ధికి కృషి చేస్తానని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. కొన్ని గాయాలు మానడానికి సమయం పడుతుందని, కానీ ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక తనకు లేదని తేల్చి చెప్పారు. తాను ప్రజల శ్రేయస్సును మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ యువత ముందుకు సాగడం కష్టమేనని.. అయితే ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకురావడమే తమ పీఎంఎల్-ఎన్ లక్ష్యమని అన్నారు. ఈ రోజు దేశం పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విచారం వ్యక్తం చేసిన ఆయన.. పాకిస్తాన్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళతానని ప్రతిజ్ఞ చేశారు. మనమంతా కలిసి మరోసారి పాకిస్థాన్‌ను ప్రగతి పథంలో తీసుకెళ్తామని పిలుపునిచ్చారు.