Ro Khanna: రాహుల్ అనర్హతపై యూఎస్ చట్ట సభ్యుడు సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-03-25T19:29:34+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు..
వాషింగ్టన్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు (Disqualification) వేయడంపై భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (Ro Khanna) ఘాటుగా స్పందించారు. గాంధీ సిద్ధాంతాలకు, భారతదేశ విలువలకు తీవ్ర ద్రోహంగా ఈ చర్యను ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
''రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి బహిష్కరించడం గాంధీ సిద్ధాంతాలు, భారతదేశ సమున్నత విలువలకు ద్రోహం చేయడమే. మా తాతయ్య ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదు. భారత ప్రజాస్వామ్యం కోసం రాహుల్‌పై అనర్హత వేటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది'' అని మోదీకి ఆ ట్వీట్‌ను ఆయన ట్యాగ్ చేశారు. సిలికాన్ వ్యాలీలోని యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఖన్నా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జార్జి అబ్రహం సైతం మరో ట్వీట్‌లో రాహుల్‌పై అనర్హత వేటును ఖండించారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది చెడ్డరోజు అని అన్నారు. ''భారత ప్రజాస్వామ్యానికి ఇది చెడురోజు. భారతీయుల వాక్ స్వేచ్ఛకు మోదీ సర్కార్ మరణ ఘంటికలు మోగించింది'' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం ప్రసాదించిన స్ఫూర్తిని, రాజకీయ ప్రచారంలో చేసిన విమర్శలపై కింది కోర్టు ఇచ్చిన తీర్పుతో సమానంగా పోల్చడం సిగ్గుచేటని అన్నారు.