Rahul Gandhi : సోనియా గాంధీ నివాసంలో పెళ్లి ముచ్చట్లు
ABN , First Publish Date - 2023-07-29T13:56:42+05:30 IST
కాంగ్రెస్ ప్రథమ కుటుంబం ఇటీవల మహిళా రైతులతో ఆనందంగా గడిపింది. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం పెళ్లివారి ఇల్లులా కళకళలాడింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా గ్రామీణ మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేస్తూ, కలుపుగోలుగా మాట్లాడుతూ, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రథమ కుటుంబం ఇటీవల మహిళా రైతులతో ఆనందంగా గడిపింది. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం పెళ్లివారి ఇల్లులా కళకళలాడింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా గ్రామీణ మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేస్తూ, కలుపుగోలుగా మాట్లాడుతూ, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వారు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించి, వారితో కలిసి నృత్యం చేశారు. రాహుల్ ఇటీవల హర్యానాలో పర్యటించినపుడు ఈ మహిళలకు ఇచ్చిన మాట నిలుపుకొని, ‘ఢిల్లీ దర్శన్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో, వారంతా చాలా సంతోషించారు.
రాహుల్ గాంధీ ఇటీవల ప్రజలకు చేరువయ్యేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన జూలై 8న హర్యానాలోని సోనిపట్ జిల్లా, మదీనా గ్రామంలో ఓ పొలంలోకి వెళ్లారు. అక్కడి మహిళలతో మాట్లాడారు. వరి నాట్లు వేశారు. ట్రాక్టర్‌ను నడిపారు. కూలీలు, కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చిన ఆహారాన్ని స్వీకరించారు.
తాము ఢిల్లీకి సమీపంలో ఉన్నప్పటికీ ఆ నగరాన్ని ఎప్పుడూ చూడలేదని ఆ మహిళలు ఆయనకు చెప్పారు. అప్పుడు ఆయన వారికి ‘ఢిల్లీ దర్శన్’ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆయన తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో ఆ మహిళల చేత ఫోన్ ద్వారా మాట్లాడించారు. అప్పుడు వారు ‘‘మేం మీ ఇంటికి భోజనానికి వస్తాం’’ అని చెప్పారు
రాహుల్ ఈ హామీని నిలబెట్టుకుని ఈ నెల 16న ఆ మహిళలను ‘ఢిల్లీ దర్శన్’కు ఆహ్వానించారు. వీరంతా బస్సుల్లో ఢిల్లీలోని 10, జన్‌పథ్‌లో సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. వారందరికీ సోనియా, రాహుల్, ప్రియాంక సాదరంగా స్వాగతం పలికారు. వారందరితోనూ ఆప్యాయంగా ముచ్చటించారు.
ఆ సమయంలో ఓ మహిళా రైతు మాటలతో వాతావరణం మరింత సందడిగా మారింది. ఆమె సోనియా గాంధీతో మాట్లాడుతూ, ‘‘రాహుల్ గాంధీకి పెళ్లి చేయండి’’ అని అన్నారు. అందుకు సోనియా బదులిస్తూ, ‘‘ఆయన కోసం ఓ అమ్మాయిని చూడండి’’ అని చెప్పారు. వీరిద్దరి మాటలను వింటున్న రాహుల్ స్పందిస్తూ, ‘‘(పెళ్లి) జరుగుతుంది’’ అన్నారు. మరో మహిళ ఓ చెమ్చాతో ఓ తినుబండారాన్ని రాహుల్ గాంధీకి తినిపించారు. ఆయన దానిని తింటూ ఆస్వాదించారు.
ప్రియాంక మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తన కన్నా చాలా చిలిపివాడని, అయినా చీవాట్లు తనకు తగిలేవని అన్నారు. ఈ మాటలను విన్న గ్రామీణ మహిళలు గొల్లుమని నవ్వారు.
రాహుల్ గాంధీ ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విటర్)లో శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఈరోజు అమ్మకు, ప్రియాంకకు, నాకు గుర్తుండిపోయే రోజు. ఈరోజు చాలా ప్రత్యేకమైన అతిథులు వచ్చారు. సోనిపట్ మహిళా రైతుల ఢిల్లీ దర్శన్ జరిగింది. వారితో కలిసి ఇంట్లో భోజనం చేశాం. ఎన్నో మాట్లాడుకున్నాం. అమూల్యమైన బహుమానాలను తీసుకున్నాం. దేశవాళీ నెయ్యి, స్వీట్ లస్సీ, ఇంట్లో తయారు చేసిన పచ్చళ్లు, గొప్ప ప్రేమాభిమానాలు పొందాం’’ అని తెలిపారు. ‘‘మహిళ ఎవరికన్నా తక్కువ కాదు. సమాజం మహిళలను అణచివేస్తోంది. మహిళ తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలి’’ అని ఈ యూట్యూబ్ వీడియోలో చెప్పారు.
సోనియా గాంధీతో మహిళలు మాట్లాడుతూ, ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
Manipur : మణిపూర్ బయల్దేరిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు
Bharat Jodo Yatra : ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో మరోసారి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’