Madhya Pradesh : ఎన్ఐఏ హెచ్చరికతో ఓ వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2023-02-28T19:27:20+05:30 IST
మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) మాట్లాడుతూ, సర్ఫరాజ్ (40) అనే వ్యక్తిని ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.
ఇండోర్ (మధ్య ప్రదేశ్) : పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇండోర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి 2005 నుంచి 2018 మధ్యలో చైనా, హాంగ్ కాంగ్‌లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఐఎస్ఐతోపాటు ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం.
మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) మాట్లాడుతూ, సర్ఫరాజ్ (40) అనే వ్యక్తిని ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అందజేసిన సమాచారం మేరకు ఈ అరెస్ట్ జరిగిందన్నారు. సర్ఫరాజ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందని, తమ రాష్ట్రం శాంతి దీవి అని, అనుమానాస్పద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నవారిని వదిలిపెట్టబోమని చెప్పారు.
ఇండోర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రజత్ సక్లేచా మాట్లాడుతూ, ముంబై పోలీసులు, ఎన్ఐఏ ఇచ్చిన సమాచారం మేరకు తాము ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఆ వ్యక్తి పేరును చెప్పడానికి తిరస్కరించారు. ఈ వ్యక్తికి ఐఎస్ఐతోపాటు ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నట్లు అనుమానం ఉందని చెప్పారు. ఈ వ్యక్తి ఇండోర్‌లోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడని తెలిపారు. ఆయనను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. తాను 2005 నుంచి 2018 మధ్యలో హాంగ్ కాంగ్, చైనాలలో ఉన్నట్లు ఆ వ్యక్తి చెప్పారన్నారు. తాను ఓ చైనీస్ మహిళను పెళ్లి చేసుకున్నానని, విడాకుల కేసు చైనాలో పెండింగ్‌లో ఉందని చెప్పారన్నారు. ఆమె తరపు న్యాయవాది తనపై ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు తప్పుడు ఫిర్యాదు చేశారని చెప్పినట్లు తెలిపారు.
ఈ వ్యక్తిని అన్ని కోణాల్లోనూ కేంద్ర, రాష్ట్ర సంస్థల సహకారంతో ప్రశ్నిస్తున్నట్లు ఇండోర్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
PM Modi : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెను మార్పులు : మోదీ
United Nations : నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రతినిధి ఐరాస సమావేశానికి హాజరు!