Asaduddin Owaisi: దేశ విభజనపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. అదో చారిత్రక తప్పిదమంటూ కుండబద్దలు
ABN , First Publish Date - 2023-10-16T21:22:24+05:30 IST
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఈసారి దేశ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఈసారి దేశ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ విభజన దురదృష్టకరమని, దేశ విభజన జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ దేశ విభజన ఒక చారిత్రక తప్పిదమని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే.. దీనిపై తాను ఒక్క లైన్‌లో సమాధానం చెప్పలేనన్నారు. ఈ చారిత్రక తప్పిదానికి దేశ విభజన నాటి నాయకులే బాధ్యులని ఆరోపణలు చేశారు. తాను చేసే వ్యాఖ్యలపై పూర్తి స్పష్టత రావాలంటే.. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు.
అక్టోబర్ 16వ తేదీన హైదరాబాద్‌లో ఒక మీడియా సంస్థతో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘చారిత్రాత్మకంగా మనది (పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలిపి) ఒకే దేశంగా ఉండేది. కానీ.. దురదృష్టవశాత్తూ దీనిని విభజించేశారు. ఇలా జరగకుండా ఉండాల్సింది. ఈ అంశంపై మీరు చర్చ పెడితే.. ఈ దేశ విభజనకు బాధ్యులెవరో నేను వివరంగా చెప్తాను. ఆ సమయంలో జరిగిన చారిత్రక తప్పిదానికి నేను ఇప్పుడు ఒక్క లైన్ సమాధానం చెప్పలేను. అసలు ఈ దేశాన్ని విభజించి, పంచాల్సింది కాదు. ఆ సమయంలో అక్కడున్న నాయకులందరూ ఈ విభజనకు బాధ్యులే. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించిన ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ పుస్తకాన్ని చదివితే.. మౌలానా ఆజాద్ కూడా దేశాన్ని విభజించవద్దని కాంగ్రెస్ నేతలను అభ్యర్థించిన విషయం తెలుస్తుంది’’ అని అన్నారు. అప్పటి ఇస్లాం పండితులు సైతం రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారని ఒవైసీ పేర్కొన్నారు.
కాగా.. వచ్చే నెలలో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బహుశా అప్పటి కాంగ్రెస్ నేతలు చేసిన తప్పదాలే వల్లే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించే కోణంలో.. ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. ఇదిలావుండగా.. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. మిజోరాంలో 7వ తేదీన, ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో (నవంబర్ 7, 17), మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23 ఓటింగ్ జరగనుంది.