Nitish Kumar: మళ్లీ బీజేపీ వైపు అడుగులేస్తున్న నితీశ్ కుమార్!
ABN , First Publish Date - 2023-02-16T20:44:41+05:30 IST
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ది(Nitish Kumar) ప్రస్తుత రాజకీయాల్లో
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ది(Nitish Kumar) ప్రస్తుత రాజకీయాల్లో ఒక భిన్నమైన శైలి. రాజకీయాలన్నీ మురికి కంపు, వారసుల కంపు కొడుతున్న ఈ రోజుల్లో ఆ మకిలి అంటించుకోని అతికొద్ది మంది నాయకుల్లో ఆయనొకరు. ప్రధానమంత్రి రేసులో ఉన్న అతి కొద్దిమందిలో ఆయన కూడా ఒకరు. ఒంటికి ఏ మకిలీ అంటించుకోకపోయినా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ చతురత మాత్రం కాస్తంత ఎక్కువే. రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఆయనకు ఎత్తుపల్లాల గురించి బాగా తెలుసు.
నితీశ్.. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), ఆర్జేడీ(RJD) వంటి అన్ని ప్రధాన పార్టీలతోనూ కలిసి పనిచేశారు. గత ఎన్నికల వరకు బీజేపీతో కలిసి తిరిగిన ఆయన ఆ తర్వాత ఆ పార్టీకి రాంరాం చెప్పేసి ఆర్జేడీ చేయందుకున్నారు. ఏడు పార్టీలతో కలిసి ‘మహాఘట్బంధన్’ పేరుతో కూటమి ఏర్పాటు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.
అలవాటైన పనే..
నితీశ్ కుమార్‌కు పార్టీలు మారడం చాలా మామూలు విషయం. రెండు దశాబ్దాలుగా సీఎంగా ఉన్న నితీశ్ తరచూ పార్టీలు మారడం వల్ల ప్రజల్లో ఆయన విశ్వసనీయత కోల్పోతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, రాజకీయ నాయకులకు అది అలవాటైన పనే కాబట్టి నితీశ్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ఆయన మనసెందుకో కీడు శంకించింది. తన పదవికి బీజేపీ ఎసరు పెట్టే అవకాశం ఉందని అనుమానించారు. జేడీయూ మాజీ నేత ఆర్సీపీ సింగ్‌ను బీజేపీ తెరపైకి తీసుకురావడంతో ఆ అనుమానం మరింత పెద్దదైంది. జేడీయూలో చీలక తేవడం ద్వారా పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్న అనుమానంతో ఎన్డీయేకి గతేడాది గుడ్‌బై చెప్పేసి ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఆర్జేడీకి దూరమవుతున్నారా?
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నితీశ్ మళ్లీ మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ‘బీజేపీతో మళ్లీ కలవడమా?.. నెవ్వర్?’ అంటూ డైలాగులు చెప్పిన నితీశ్ తాజాగా మళ్లీ అటువైపే చూస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఫలితంగా విపక్షాల ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా-నితీశ్ కుమార్ మధ్య ఫోన్‌కాల్ సంభాషణ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ సీం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతూ వస్తున్న నితీశ్ ఇప్పుడిలా బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్త విపక్షాలకు అశనిపాతంలా మారింది.
అలాంటిదేమీ లేదు..
తాను బీజేపీ వైపు అడుగు వేస్తున్నట్టు వచ్చిన వార్తలను నితీశ్ కుమార్ కొట్టివేశారు. బీహార్‌కు కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పేందుకే అమిత్ షా తనకు ఫోన్ చేశారని చెబుతూ రూమర్లను కొట్టిపడేశారు. అయితే, ఈ మాటలు కూడా నమ్మేలా లేవు. బీజేపీ యేతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి గవర్నర్ నియామకం గురించి స్వయంగా షా ఎందుకు ఫోన్ చేసి మాట్లాడతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ చూస్తేంటే వారిద్దరి ఫోన్ సంభాషణ వెనక ఏదో ఉందన్న అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులను బట్టి వ్యవహరించడం నితీశ్‌కు వెన్నతో పెట్టిన విద్యని విమర్శిస్తున్నారు. చూడాలి మరి.. నితీశ్ వ్యూహమేంటో!