Modi Vs Rahul : రాహుల్ గాంధీపై చర్యలకు బీజేపీ ఎంపీ డిమాండ్
ABN , First Publish Date - 2023-02-08T12:00:40+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిరాధారమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై నిరాధారమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై చర్య తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిసికాంత్ దుబే (Nishikant Dubey) డిమాండ్ చేశారు. మోదీపై రాహుల్ చేసిన ఆరోపణలు అవమానకరంగా ఉన్నాయని, అవన్నీ నిరాధారమైనవని ఆరోపించారు. ఈ ఆరోపణలను బలపరచే పత్రాలేవీ లేవన్నారు. వీటిలో కొన్ని ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించారని తెలిపారు.
దుబే లోక్‌సభ సభాపతి ఓం బిర్లా (Om Birla)కు రాసిన లేఖలో, రాహుల్ గాంధీ పార్లమెంటు (Parliament)లో మంగళవారం మాట్లాడుతూ మోదీపై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించే విధంగా, అవమానకరంగా ఉన్నాయన్నారు. సభతోపాటు ప్రధాన మంత్రి గౌరవానికి తగినట్లుగా, హుందాగా లేవని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను బలపరచే పత్రాలను ఆయన సభకు సమర్పించలేదన్నారు. మోదీ లోక్‌సభ సభ్యుడనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రవర్తన సభా హక్కుల ఉల్లంఘన అని తెలిపారు. అంతేకాకుండా సభను ధిక్కరించినట్లు స్పష్టంగా వెల్లడవుతోందన్నారు. సభను ధిక్కరించినందుకు, సభా హక్కులను ఉల్లంఘించినందుకు గాంధీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గాంధీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ, ప్రధాని మోదీపైనా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీపైనా విరుచుకుపడ్డారు. అదానీ వ్యాపార సామ్రాజ్యానికి మోదీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. విమానాశ్రయాల నిర్వహణలో అదానీకి ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ ఆయనకు అనుకూలంగా నిబంధనలు మార్చి, ఆరు విమానాశ్రయాలు కట్టబెట్టారని ఆరోపించారు. ముంబై విమానాశ్రయాన్ని జీవీకే గ్రూపు నిర్వహిస్తుండగా, సీబీఐ, ఈడీలతో ఈ గ్రూపుపై దాడి చేయించి, ఆ విమానాశ్రయాన్ని అదానీకి అప్పగించేలా చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రేవులను ఇదే విధంగా అదానీకి కట్టబెట్టారన్నారు. తన భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ఒకే ఒక వ్యాపారవేత్త పేరు వినిపించిందని, అది అదానీ అని చెప్పారు.
ఇదిలావుండగా, రాహుల్ వ్యాఖ్యలను జీవీకే గ్రూప్ అధికార ప్రతినిధి ఖండించారు. ముంబై విమానాశ్రయంలో వాటాలను అదానీకి అమ్మాలనే నిర్ణయాన్ని తమ యాజమాన్యం తీసుకుందని పునరుద్ఘాటించారు. తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవన్నారు.
మరోవైపు గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిజు లోక్‌సభలో మాట్లాడుతూ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేయవద్దని కోరారు. నిసికాంత్ దుబే మాట్లాడుతూ, టాటా, బిర్లా, అంబానీ కాంగ్రెస్‌కు మిత్రులని, వార్తా పత్రికలను నడిపే పారిశ్రామికవేత్తలు కూడా ఆ పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు.