Supreme Court : తల్లిదండ్రుల పెళ్లి చెల్లకపోయినా పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుంది : సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2023-09-02T09:44:46+05:30 IST
దంపతుల వివాహానికి చట్టబద్ధత లేకపోయినప్పటికీ, వారికి పుట్టిన పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అటువంటి సంతానం తమ తల్లిదండ్రులు మరణించిన తర్వాత హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వాటాను పొందుతారని తెలిపింది.
న్యూఢిల్లీ : దంపతుల వివాహానికి చట్టబద్ధత లేకపోయినప్పటికీ, వారికి పుట్టిన పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అటువంటి సంతానం తమ తల్లిదండ్రులు మరణించిన తర్వాత హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వాటాను పొందుతారని తెలిపింది. ఆ తల్లిదండ్రులకు ఆ ఆస్తిలో ఉన్న వాటాలో ఈ సంతానానికి వారసత్వ హక్కు ఉంటుందని వివరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud), జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పునిచ్చింది.
తల్లిదండ్రుల వివాహం చెల్లుబాటుకానపుడు వారికి పుట్టిన పిల్లలు కేవలం హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వారి తల్లిదండ్రులకు లభించే వారసత్వ ఆస్తికి మాత్రమే వారసులవుతారని తెలిపింది. వారి తల్లిదండ్రుల ఆస్తిలో మాత్రమే హక్కులను కోరవచ్చునని తెలిపింది. ఆ హిందూ ఉమ్మడి కుటుంబంలోని ఇతర సభ్యుల ఆస్తిపై హక్కును కోరకూడదని తెలిపింది.
వివాహం చెల్లుబాటుకాని దంపతులు మరణించడంతో హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో భావిత పంపకాల ఆధారంగా వారికి హక్కు లభిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. భావిత విభజన అంటే వాస్తవంగా పంపకాలు జరగవు. కానీ మానసికంగా పంపకాలు జరిగినట్లు భావించి, హక్కును కోరవచ్చునని తెలిపింది.
హిందూ మితాక్షర చట్టం వర్తించే హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తులకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేవనసిద్ధప్ప వర్సెస్ మల్లికార్జున్ కేసులో 2011లో ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై వివరణ కోరినపుడు సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. చెల్లని/రద్దు చేయదగిన వివాహం చేసుకున్న దంపతులకు పుట్టిన పిల్లలు తమ తల్లిదండ్రుల ఆస్తిలో వారసత్వ హక్కులు పొందడానికి అర్హులేనని ఇద్దరు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ తల్లిదండ్రుల ఆస్తి స్వీయార్జితమైనా, పూర్వీకుల నుంచి వచ్చినదైనా, వారికి పుట్టిన సంతానానికి హక్కు ఉంటుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3: చంద్రునిపై కనుగొన్న మూలకాల ప్రాముఖ్యత ఏంటి? ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు?
Special buses: నేడు, రేపు 400 ప్రత్యేక బస్సులు