UCC Vs Congress : ఉమ్మడి పౌర స్మృతిపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-28T10:32:02+05:30 IST
ఉమ్మడి పౌర స్మృతి అవసరం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి వక్కాణించడంతో దీనిపై చర్చ ఊపందుకుంది. ఇది ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నమని కాంగ్రెస్ తదితర పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC) అవసరం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నొక్కి వక్కాణించడంతో దీనిపై చర్చ ఊపందుకుంది. ఇది ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నమని కాంగ్రెస్ తదితర పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం (P Chidambaram) తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ మంగళవారం మాట్లాడుతూ రెండు రకాల చట్టాలతో కుటుంబం మనుగడ కొనసాగగలదా? అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ కుటుంబం సజావుగా మనుగడ సాగించగలుగుతుందా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పౌర స్మృతి దేశానికి అవసరమని తెలిపారు. ఈ వ్యాఖ్యలను చిదంబరం తప్పుబట్టారు. కుటుంబాన్ని దేశంతో పోల్చడం సరికాదన్నారు.
ఓ విధంగా చూసినపుడు కుటుంబాన్ని దేశంతో పోల్చడం సరైనదేనని అనిపించవచ్చునని తెలిపారు. అయితే వాస్తవంలో ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. రక్త సంబంధాలతో కూడినది కుటుంబం అని, రాజ్యాంగం దేశాన్ని కలిపి ఉంచుతుందని, రాజ్యాంగం అంటే రాజకీయ-చట్టపరమైన దస్తావేజు అని తెలిపారు. కుటుంబంలో సైతం వైవిద్ధ్యం ఉంటుందన్నారు. భారతీయుల మధ్య వైవిద్ధ్యాన్ని, బహుళత్వాన్ని భారత రాజ్యాంగం గుర్తించిందన్నారు. యూసీసీ అనేది ఓ కోరిక, అభిలాష అని తెలిపారు. ఓ ఎజెండాతో నడిచే మెజారిటేరియన్ గవర్నమెంట్ దీనిని ప్రజలపై రుద్దకూడదన్నారు. ఇది సాధారణ కసరత్తులా చూపించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత లా కమిషన్ నివేదికలో ఇది ఇప్పుడు సాధ్యం కాదని చెప్పిందని, దీనిని మోదీ చదవాలని అన్నారు. బీజేపీ మాటలు, చేతల వల్ల దేశం నేడు విడిపోయిందన్నారు. ప్రజలపై యూసీసీని రుద్దడం వల్ల ఈ విభజనలు మరింత విస్తరిస్తాయని హెచ్చరించారు.
మోదీ యూసీసీ గురించి గట్టిగా చెప్పడానికి కారణం ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనే వ్యూహమేనని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్వేష నేరాలు, వివక్ష, రాష్ట్రాల హక్కుల నిరాకరణ వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే మోదీ యూసీసీ గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సుపరిపాలనను అందించడంలో బీజేపీ విఫలమైందని, ఓటర్లను పోలరైజ్ చేయడం కోసమే యూసీసీని రంగంలోకి దించుతోందని, తద్వారా రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
Rajya Sabha polls : మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జూలైలో
Yogi Guidelines : రోడ్లపై అడ్డంకులు సృష్టిస్తే ఖబడ్దార్.. పండుగలకు యూపీ ప్రభుత్వం మార్గదర్శకాలు..