Enforcement Directorate: నగరంలో మళ్లీ.. ఈడీ ప్రకంపనలు
ABN , First Publish Date - 2023-08-04T08:28:41+05:30 IST
రాష్ట్రంలో మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ప్రకంపనలు రేగుతున్నాయి. కరూరులో మంత్రి సెంథిల్‌బాలాజి సహాయకుడి నివాస గృహం, కార్యాలయం
- మంత్రి సెంథిల్‌బాలాజీ సహాయకుడి నివాసం సహా 12 చోట్ల తనిఖీలు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ప్రకంపనలు రేగుతున్నాయి. కరూరులో మంత్రి సెంథిల్‌బాలాజి సహాయకుడి నివాస గృహం, కార్యాలయం సహా 12 చోట్ల ఈడీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంత్రి సెంథిల్‌బాలాజి(Minister Senthilbalaji) 2011 -16 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా ఉంటూ ఆ సంస్థలో ఉద్యోగాలు తీసిస్తామని 80 మందిని మోసగించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా సెంథిల్‌బాలాజి అస్వస్థతకు గురై బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈడీ అధికారులు ఇటీవలే ఆయన్ని పుళల్ జైలుకు తరలించారు. అదే సమయంలో మంత్రి స్నేహితులైన శంకర్, కొంగు మెస్ యజమాని మణి తదితరుల నివాస గృహాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఎనిమిది రోజులపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఈడీ అధికారులు కరూరులో మంత్రి సెంథిల్‌బాలాజి స్నేహితుల నివాసగృహాలు సహా 12 చోట్ల సోదాలు చేపట్టారు. తొలుత శంకర్ నివాసగృహం, కార్యాలయం వద్ద అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు ప్రారంభించారు.
ఇదే విధంగా గెంగునాథపురంలోని సెంథిల్‌బాలాజి అనుచరులు నడుపుతున్న మార్బుల్ కంపెనీలోను తనిఖీలు జరిపారు. ఆ కంపెనీ నిర్వాహకుడైన ప్రకాష్ నివాసంలో సోదాలు నిర్వహించారు. కోయంబత్తూరులో టాస్మాక్ సూపర్‌వైజర్ ముత్తుబాలన్ నివాగసృహంలో 10 మంది ఈడీ అధికారులు తనిఖీ చేసి కీలకమైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరులోని రామనాఽథపురం ప్రాంతం వద్ద నున్న సెంథిల్‌బాలాజి సహాయకుడు అరుణ్ నివాసగృహంలో ఆరుగురు ఈడీ అధికారులు తనిఖీల జరిపారు. కాగా బుధవారం దిండుగల్ జిల్లా వేడచందూరు ప్రాంతంలోని డీఎంకే స్థానిక శాఖ నాయకుడి నివాసగృహం, కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. అన్ని చోట్లా కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం సభ్యుల కాపలాతో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగించారు.