Governor x CM: అసలు ఆ అధికారం గవర్నర్‌కు ఉందా?

ABN , First Publish Date - 2023-07-01T08:41:54+05:30 IST

మంత్రి సెంథిల్‌ బాలాజిని(Minister Senthil Balajini) డిస్మిస్‌ చేస్తూ ప్రకటించి, ఐదు గంటల్లోనే ఆ ఉత్తర్వులను నిలుపుదల

Governor x CM: అసలు ఆ అధికారం గవర్నర్‌కు ఉందా?

- మంత్రి డిస్మిస్‌పై సర్వత్రా చర్చ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మంత్రి సెంథిల్‌ బాలాజిని(Minister Senthil Balajini) డిస్మిస్‌ చేస్తూ ప్రకటించి, ఐదు గంటల్లోనే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర గవర్నర్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఆయనకు ఆ అధికారం ఉందా అన్నదానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజ్యాంగ ధర్మాసనంలోని 153-161 సెక్షన్లు రాష్ట్రాల గవర్నర్‌కు ఉన్న అధికారాలను తెలియజేస్తాయి. కేంద్రంలో రాష్ట్రపతి పదవి లాంటిదే రాష్ట్ర గవర్నర్‌ పదవి అని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. కేంద్రప్రభుత్వ సలహాల మేరకే రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు. కనుక కేంద్రప్రభుత్వానికి రాష్ట్రప్రభుత్వానికి నడుమ వారథిలా గవర్నర్‌ పనిచేయాల్సి ఉంది. ఓ మంత్రిని గవర్నర్‌ డిస్మిస్‌ చేయగలరా అన్నదానిపై రాజ్యాంగ ధర్మాసనం 164(1) సెక్షన్‌ ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల నియామకాల గురించి చెబుతోంది. ఈ మేరకు సీఎంను నియమించేటప్పుడు గవర్నర్‌ ఎవరి సలహాలనూ స్వీకరించనవసరం లేదు. అయితే ముఖ్యమంత్రి సిఫారసు మేరకే మంత్రులను నియమించాల్సి ఉంటుంది. గవర్నర్‌ తనంతట తానుగా ఎవరినీ మంత్రిగా నియమించే అధికారం లేదు. ముఖ్యమంత్రి ప్రతిపాదన, సలహాల మేరకు మంత్రులను గవర్నర్‌ నియమించాల్సివుంటుంది. రాజ్యాంగ ధర్మాసనం 163వ సెక్షన్‌ ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం సలహాల ప్రకారమే గవర్నర్‌ వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేయబడింది. ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు మంత్రులను నియమించవచ్చు. ముఖ్యమంత్రి సిఫారసు లేకుండా మంత్రివర్గం నుంచి ఎవరినైనా తొలగించేందుకు, లేదా ఎవరినైనా నియమించేందుకు అధికారం లేదని రాజ్యాంగ ధర్మాసం 163, 164 సెక్షన్లు తేటతెల్లం చేస్తున్నాయి.

సుప్రీం తీర్పులు...

ఇక గవర్నర్‌ అధికారాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు కూడా మంత్రుల నియామకానికి సంబంధించి గవర్నర్‌కు ఎలాంటి అధికారాలు లేవని స్పష్టం చేస్తున్నాయి. షంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ ప్రభుత్వం కేసు (1974)లో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాగ ధర్మాసనం అత్యవసర పరిస్థితులలో మాత్రమే గవర్నర్‌కు కొన్ని అసాధారణమైన అధికారాలు ఉంటాయని, తక్కిన పరిస్థితుల్లో ఆయన మంత్రివర్గానికి బద్ధుడని స్పష్టం చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రికి మెజారిటీ లేకుంటే, ప్రభుత్వాన్నే బర్తరఫ్‌ చేయగలరని పేర్కొంది. అదే సమయంలో జైలు శిక్షపడినవారు లేదా పలు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నవారు మంత్రిగా, శాసనసభ్యుడిగా అనర్హులని ప్రకటించే అధికారం గవర్నర్‌కు లేనేలేదు. న్యాయస్థానంలో జైలు శిక్షపడిన వ్యక్తినే గవర్నర్‌ డిస్మిస్‌ చేయగలుగుతారు. ఇప్పుడు అ అసాధారణమైన అధికారంతోనే గవర్నర్‌ సెంథిల్‌ బాలాజీని తొలగించారని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తుండగా, అలాంటి పరిస్థితి ఏదీ లేదని డీఎంకే వర్గాలు వాదిస్తున్నాయి.

nani4.jpg

Updated Date - 2023-07-01T08:41:54+05:30 IST