Nirmala Sitharaman: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం.. నిర్మలా ఆశాభావం
ABN , First Publish Date - 2023-11-15T16:37:49+05:30 IST
Economy: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీ: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ ఇండో-ఫసిపిక్ ప్రాంతీయ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. " ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు(GDP) కేవలం 7 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్(India) ఈ మేర వృద్ధి సాధించడం గొప్ప విషయం. ఆర్థిక వ్యవస్థ ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనిస్తోంది. మరో నాలుగేళ్లలో జపాన్, జర్మనీ ఆర్థిక వ్యవస్థలను దాటుకుని దూసుకుపోతుందని ఆశిస్తున్నాం. ఉక్రెయిన్ - రష్యా, ఇజ్రాయెల్ - హమాస్‌ల మధ్య యుద్ధం జరుగుతున్నా.. ఆ ప్రభావాన్ని అధిగమించి వృద్ధి రేటు సాధిస్తున్నాం.
9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు సముద్రతీరాన్ని కలిగి ఉన్నాయి. 12 మేజర్, 200లకు పైగా నాన్-మేజర్ ఓడరేవులు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ వాణిజ్యం కోసం విస్తృతమైన సముద్ర నెట్ వర్క్ కలిగి ఉన్నాం. 2020లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో సముద్ర ఆధారిత వస్తువులను ఎగుమతి చేసే 2వ అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. నేడు ఇండియన్స్ స్వదేశంలో, విదేశాల్లో తలెత్తుకుని నిలబడుతున్నారు. భారత్ విజయాలను సగర్వంగా చాటి చెబుతున్నారు.
బ్రౌన్ ఎకానామీ(Brown Economy) నుంచి బ్లూ ఎకానమీగా మార్చడంపై దృష్టి సారించాం. అనేక గణాంకాలు సూచించే విధంగా వ్యాపారానికి అనుకూలమైన వాతావరణంతో సుపరిపాలన, వినూత్న దేశంగా భారత్ తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఇండో-పసిఫిక్ తీరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
అంతర్జాతీయ ఎగుమతుల పరంగా, భారత్ ర్యాంకు 2014లో 44వ స్థానంలో ఉండగా... 2023 నాటికి ఆ ర్యాంకు 22కు చేరుకుంది. 2022లో ప్రారంభించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (NMP) కింద మానిటైజేషన్ కోసం 9 మేజర్ పోర్ట్‌లలో 31 ప్రాజెక్టులను గుర్తించాం. భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ (IMEC) అత్యంత ఆశాజనకమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ కారిడార్ ద్వారా రవాణా సామర్థ్యాన్ని పెంచడం, లాజిస్టిక్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించవచ్చు. దక్షిణాసియా, పశ్చిమాసియా, యూరప్‌ల ఆర్థిక ఏకీకరణకు దారితీసే ఈ కారిడర్ భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. ఆయా ప్రదేశాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది" అని ఆమె పేర్కొన్నారు.