Karnataka polls: తొలిజాబితా సిద్ధం.. ప్రముఖులు వీరే..!
ABN , First Publish Date - 2023-04-10T12:11:38+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసిన బీజేపీ అధిష్ఠానం 170 నుంచి 180 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సిద్ధం..
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసిన బీజేపీ అధిష్ఠానం 170 నుంచి 180 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సిద్ధం చేసింది. సోమవారం సాయంత్రం జాబితా విడుదల కానున్నట్టు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్ప ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ సహా భారతీయ జనతా పార్టీ సీఈసీ సభ్యులు ఆదివారంనాడు సమావేశమై అభ్యర్థుల జాబితాపై సమాలోచన చేశారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, సీనియర్ నేతలు బీఎస్ యడియూరప్ప, బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జి అరుణ్ సింగ్, కో-ఆర్డినేటర్ డీకే అరుణ, ఎలక్షన్ ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్, ఎలక్షన్ కో-ఇన్‌చార్జి మన్షుక్ మాండవీయ హాజరయ్యారు. దీనికి ముందు బసవరాజ్ బొమ్మై, యడియూరప్ప, కటీల్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకుని జేపీ నడ్డా నివాసంలో జాబితా ఖరారుపై చర్చలు సాగించారు. ఈ సమావేశంలో అమిత్‌షా, ఇతర కేంద్ర నాయుకులు సైతం పాల్గొన్నారు. శనివారంనాడు సీటీ రవి, గోవింద్ కర్జోల్ సైతం ఢిల్లీ చేరుకుని సమావేశాలకు హాజరయ్యారు. తుది సమావేశం నడ్డా నివాసంలో ఆదివారం జరిగింది. జాబితాకు తుదిరూపం ఇచ్చారు. సీఈసీ ఆమోదం కోసం సోమవారం మరోమారు సమావేశమై జాబితాను ప్రకటించనున్నట్టు యడియూరప్ప తెలిపారు.
జాబితాలో ప్రముఖులు...
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో బసవరాజ్ బొమ్మై, బీఎస్ విజయేంద్ర, సీటీ రవి రమేష్ జార్కిహోలి, తదుతరుల పేర్లు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గెలుపు ఆధారంగానే అభ్యర్థుల ఎంపికకు జేపీ నడ్డా ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా రాష్ట్ర నాయకులు కృషి చేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 142 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 93 సీట్లకు అభ్యర్థుల పేర్లను జేడీఎస్ ప్రకటించింది. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి.