Share News

Mohan Yadav: నేడు కేబినెట్ విస్తరణ.. 28 మందికి మంత్రులుగా అవకాశం

ABN , Publish Date - Dec 25 , 2023 | 12:27 PM

CM Mohan Yadav: నేడు మధ్యప్రదేశ్ కేబినెట్‌ను విస్తరించనున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రి వర్గంలో 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.

Mohan Yadav: నేడు కేబినెట్ విస్తరణ.. 28 మందికి మంత్రులుగా అవకాశం

భోపాల్: నేడు మధ్యప్రదేశ్ కేబినెట్‌ను విస్తరించనున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రి వర్గంలో 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎంపీలతోపాటు సీనియర్లు, పలువురు కొత్త ముఖాలకు కూడా మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీజేపీ నేత తెలిపారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారిలో కొందరికీ ఈ మంత్రి వర్గంలోనూ చోటు దక్కే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రుల జాబితాను గవర్నర్ మంగుభాయి పటేల్‌కు సీఎం మోహన్ యాదవ్ అందించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కొత్తగా మంత్రులుగా నియమించిన వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.


కాగా ఈ నెల 3న వెలువడిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 230 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 163 చోట్ల విజయం సాధించింది. దీంతో మధ్యప్రదేశ్‌లో వరుసగా రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది. సీఎంగా మోహన్ యాదవ్, డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవా, రాజేంద్ర శుక్లా డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేశారు. కాగా గత 18 సంవత్సరాల కాలంలో 16 సంవత్సరాలు మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహానే వ్యవహరించారు.

Updated Date - Dec 25 , 2023 | 12:27 PM