Mallikarjun Kharge: సీబీఐ, ఈడీ దాడులతో ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు.. కేంద్రంపై ధ్వజమెత్తిన ఖర్గే

ABN , First Publish Date - 2023-09-18T15:58:08+05:30 IST

గత కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు అమాంతం పెరిగిపోయిన విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలనే టార్గెట్ చేస్తూ, ఆ రెండు సంస్థలు వరుస దాడులకు...

Mallikarjun Kharge: సీబీఐ, ఈడీ దాడులతో ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు.. కేంద్రంపై ధ్వజమెత్తిన ఖర్గే

గత కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు అమాంతం పెరిగిపోయిన విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలనే టార్గెట్ చేస్తూ, ఆ రెండు సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో.. ఇదంతా కేంద్రంలోని బీజేపీ చేస్తున్న పనేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాలను బలహీనపరిచి, ఆధిపత్యం చెలాయించడం కోసమే బీజేపీ ఇలా దర్యాప్తు సంస్థల్ని తన చేతి వేళ్లపై ఆడిస్తోందంటూ.. రాజకీయ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌లోనూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘‘మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి పునాది పునాది వేశారు. అయితే.. పునాదిలో ఉపయోగించిన రాళ్లను ఎవరూ చూడలేరు. కేవలం గోడలపై రాసినవి మాత్రమే కనిపిస్తాయి. బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల వ్యవస్థకు గణనీయమైన లోపాలు ఏర్పడుతాయని నెహ్రూ విశ్వసించారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సరికాదు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది కానీ.. ఈడీ, సీబీఐ దాడులతో దాన్ని బలహీనపరచడంపై కేంద్రం దృష్టి సారించింది’’ అని చెప్పారు. తొలుత ప్రతిపక్ష నాయకుల్ని తమ సొంత పార్టీలోకి చేర్చుకొని, వారిని వాషింగ్ మెషీన్‌లో పెడుతున్నారని.. అనంతరం వాళ్లు ఎలాంటి ఆరోపణలు లేకుండా క్లీన్‌గా బయటకొచ్చి, తమ పార్టీలో పర్మినెంట్‌గా ఉంచుకుంటున్నారని.. ఈరోజుల్లో ఇదే జరుగుతుండటాన్ని అందరూ చూడొచ్చని ఖర్గే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా అరుదుగా పార్లమెంట్‌కి వస్తారని.. ఆయన వచ్చినప్పుడు దాన్నొక ఈవెంట్‌గా మార్చేసి వెళ్లిపోతారని చురకలంటించారు.

ఇదే సమయంలో తమ ఇండియా కూటమిని కేవలం ‘ఇండి’గా పిలుస్తుండటంపై ఖర్గే తనదైన శైలిలో స్పందించారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ ఇండియా కూటమిని కార్నర్ చేసేందుకు కేవలం ఇండి అని పిలుస్తోందని.. అయితే వాళ్లు ఏ పేరుతో పిలిచినా తామంతా ‘ఇండియా’ వాళ్లమేనని అన్నారు. పేరు మార్చినంత మాత్రాన ఎలాంటి నష్టం కలగదని తేల్చి చెప్పారు. ఇక మణిపూర్ అంశాన్ని మరోసారి తెరమీదకి తీసుకొచ్చి.. దేశంలోని ప్రతి ప్రాంతాన్ని ప్రధాని సందర్శిస్తారని, కానీ మణిపూర్‌కు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు.

Updated Date - 2023-09-18T15:58:08+05:30 IST