Raj Bhavan: మనమే తొందరపడ్డామా..? అంతర్మథనంలో రాజ్‌భవన్‌!

ABN , First Publish Date - 2023-07-01T08:15:25+05:30 IST

ఆది నుంచి డీఎంకే ప్రభుత్వంపై ‘సవతి తల్లి ప్రేమ’ కనబరుస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi).. డైలమాలో పడ్డారు. రాష్ట్ర

Raj Bhavan: మనమే తొందరపడ్డామా..? అంతర్మథనంలో రాజ్‌భవన్‌!

- కేంద్ర హోంశాఖ ఆదేశాలతోనే ‘పీఛేముడ్‌’

- మంత్రి సెంథిల్‌ బాలాజి డిస్మిస్‌ ఉత్తర్వుల నిలుపుదల

- రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఆది నుంచి డీఎంకే ప్రభుత్వంపై ‘సవతి తల్లి ప్రేమ’ కనబరుస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi).. డైలమాలో పడ్డారు. రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజిని డిస్మిస్‌ చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులతో తొందరపడినట్లుందని సతమతవుతున్నట్లు తెలిసింది. తన ఉత్తర్వులతో కేంద్రం నుంచి అభినందన వస్తుందనుకుంటే.. కేంద్ర హోంశాఖ(Central Home Ministry) నుంచి తీవ్ర అసంతృప్తి రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో డిస్మిస్‌ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు గురువారం అర్ధరాత్రి మరో ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వివరణాత్మకమైన లేఖ కూడా రాశారు. ప్రస్తుతం ఆ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆది నుంచి స్టాలిన్‌ ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు, ఆ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్న గవర్నర్‌.. తాజా వ్యవహారంతో ఒక్కసారిగా డైలమాలో పడినట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల నుంచి నిరసన, అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో రాజ్‌భవన్‌ ఇప్పుడు అంతర్మథనంలో పడినట్లు కనిపిస్తోంది.

4 గంటలు.. 2 నిర్ణయాలు!

మనీలాండరింగ్‌ ఆరోపణల కారణంగా ఈడీ అరెస్టు చేసిన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజి.. కావేరీ ఆసుపత్రిలో బైపాస్‌ సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన క్రియాశీలకంగా వ్యవహరించలేని పరిస్థితుల్లో ఉండడంతో ఆయన వద్ద వున్న విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖల్ని ఇతర మంత్రులకు అదనంగా అప్పగించాలన్న సీఎం సిఫారసును ఆమోదించిన గవర్నర్‌ రవి.. సెంథిల్‌ బాలాజిని శాఖలేని మంత్రిగా ఉంచడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పదవి నుంచి సెంథిల్‌బాలాజిని డిస్మిస్‌ చేస్తూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి గురువారం రాత్రి 7.45 గంటలకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులు జారీచేసిన సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్థానిక వేళచ్చేరి గురునానక్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఉన్నారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సీఎంకు తెలియజేసిన మీడియా ప్రతినిధులు.. ఆయన స్పందన కోరగా.. మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని, ఈ చర్యలను చట్టప్రకారం ఎదుర్కొంటామని పేర్కొన్నారు. అనంతరం నేరుగా తన నివాసానికి వెళ్లిన సీఎం.. న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్‌ వేయాలని న్యాయనిపుణులను పురమాయించారు. గవర్నర్‌ ఉత్తర్వులు వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే వర్గాలు రగిలిపోయాయి. న్యాయనిపుణులు సైతం గవర్నర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన నిర్ణయం న్యాయస్థానాల్లో నిలవదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 11.45 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి మరో ప్రకటన వెలువడింది. సెంథిల్‌బాలాజిని మంత్రి వర్గం నుండి డిస్మిస్‌ చేస్తూ వెలువరించిన ఉత్తర్వులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలుపుదల చేస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు.

కేంద్ర హోంశాఖ జోక్యంతోనేనా?!..

మంత్రి డిస్మిస్‌ ఉత్తర్వుల ఉపసంహరణ వెనుక కేంద్ర హోంశాఖ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని గవర్నరే తన ఉపసంహరణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే లోన చాలా పెద్ద తతంగమే జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గవర్నర్‌ నిర్ణయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంశాఖ అధికారులు దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు తెలిసింది. హోంమంత్రి అమిత్‌షా(Home Minister Amit Shah) ఆదేశాల మేరకు న్యాయనిపుణులతో భేటీ అయిన హోంశాఖ అధికారులు.. గవర్నర్‌ నిర్ణయంపై చర్చించారు. అయితే ముఖ్యమంత్రి సిఫారసు లేకుండా మంత్రిని డిస్మిస్‌ చేసే అధికారం గవర్నర్‌కు లేదని, ఇది న్యాయస్థానాల్లో నిలవదని న్యాయనిపుణులు తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే డీఎంకే నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారని గ్రహించిన అమిత్‌షా.. వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. దానికంటే ముందుగా గవర్నర్‌ జారీ చేసిన ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించారు. గవర్నర్‌ ఉత్తర్వుల్లో.. మంత్రి సెంథిల్‌బాలాజి ఉద్యోగాలు తీసిస్తానంటూ నగదు మోసాలకు పాల్పడటంతోపాటు పలు అవినీతి కేసుల్లో చిక్కుకుని ఉన్నారని, మంత్రి పదవిని దుర్వినియోగం చేసి తనపై జరుగుతున్న విచారణను పక్కదోవ పట్టించేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీ విచారణను ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర పోలీసులు కూడా ఆయనపై కొన్ని కేసులు నమోదు చేశారని, మంత్రిగా కొనసాగితే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పక్కదోవపట్టిస్తారని, ఆ కారణాల వల్లేమంత్రివర్గం నుండి ఆయన్ని డిస్మిస్‌ చేస్తున్నట్లు గవర్నర్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఇవేవీ న్యాయపరిశీలనకు పనికిరావని న్యాయనిపుణులు రాత్రి 11 గంటల ప్రాంతంలో స్పష్టం చేయడంతో.. అదే విషయాన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు గవర్నర్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. అంతేగాక వాటిని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. అయితే గవర్నర్‌ ససేమిరా అన్నట్లు తెలిసింది. అయితే కేంద్రహోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయన చేసేదేం లేక.. ఆఖరికి అర్ధరాత్రి దాటాక 11.45 గంటలకు తను ముందుగా జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2023-07-01T08:15:25+05:30 IST