I.N.D.I.A : ఇండియా కూటమి పీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ : ఆర్జేడీ డిమాండ్
ABN , First Publish Date - 2023-08-31T17:14:45+05:30 IST
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రకటించాలని జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఈ కూటమి నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది.
పాట్నా : రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రకటించాలని జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఈ కూటమి నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది. పాట్నా, బెంగళూరు సమావేశాల అనంతరం జరుగుతున్న ఈ సమావేశంలో కూటమి లోగో, సమన్వయకర్తల పేర్లను ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను కోరుకుంటున్నామని చెప్పారు. ఆయన పీఎం అభ్యర్థి అయితే నరేంద్ర మోదీ గట్టి సవాలును ఎదుర్కొంటారని చెప్పారు. దీనిపై ఇండియా కూటమి భాగస్వాములు నిర్ణయం తీసుకుంటారన్నారు.
జేడీయూ నేత విశిష్ట నారాయణ్ సింగ్ బుధవారం మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్ కుమార్ సరైన పీఎం అభ్యర్థి అని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలను సుదీర్ఘ కాలం నడిపిన అనుభవం ఆయనకు ఉందన్నారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారన్నారు.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మంగళవారమే ముంబై చేరుకున్నారు. నరేంద్ర మోదీ గొంతుపై కూర్చోవడానికి వెళ్తున్నామని లాలూ చెప్పారు. మోదీ గొంతును తాము పట్టుకున్నామని, ఆయనను పదవి నుంచి తొలగించవలసి ఉందని చెప్పారు.
అయితే నితీశ్ కుమార్ మాత్రం తనకు ఏ పదవీకాంక్ష లేదన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా అన్ని బీజేపీయేతర పార్టీలు కలిసికట్టుగా పోరాడాలన్నదే తన కోరిక అని చెప్పారు.
ఇదిలావుండగా, ఇండియా కూటమి తరపున పీఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ సరైనవారని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాఘెల్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సరైనవారని టీఎంసీ అంటోంది. అరవింద్ కేజ్రీవాల్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు. కానీ అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని ఆ పార్టీ చెప్తోంది.
ఇవి కూడా చదవండి :
Adani Group : తాజా ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్.. అవన్నీ పాత పాటలేనన్న పారిశ్రామిక దిగ్గజం..
Parliament : కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం