Lok Sabha Elections : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలపై శశి థరూర్ సంచలన జోస్యం
ABN , First Publish Date - 2023-01-14T12:45:55+05:30 IST
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత తగ్గుతుందని, 2019నాటి ప్రభంజనం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్
తిరువనంతపురం : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత తగ్గుతుందని, 2019నాటి ప్రభంజనం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ జోస్యం చెప్పారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాలను కోల్పోయే అవకాశం ఉందన్నారు. బీజేపీ 250 స్థానాలకు పరిమితమైతే, మిగిలిన పార్టీలకు 290 వస్తే, ఆ 290 వచ్చిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకారానికి వస్తాయా? కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుకునే పార్టీల్లో ఓ పార్టీ నుంచి 20 మందిని, మరో పార్టీ నుంచి 10 మందిని తీసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అనే విషయాన్ని మనం చెప్పలేమన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో శుక్రవారం 'India@75: A walk through the Democratic Institutions' సెషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2019లో సాధించిన విజయాన్ని 2024లో మళ్లీ సాధించడం బీజేపీకి అసాధ్యమని చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాలను కోల్పోయే అవకాశం ఉందన్నారు. అయితే బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. బీజేపీ చాలా రాష్ట్రాలను కోల్పోయిందని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోల్పోవడం అసాధ్యమేమీ కాదన్నారు.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అన్ని స్థానాలు బీజేపీకే దక్కాయని చెప్పారు. బిహార్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో ఒక్కొక్కటి మినహా అన్ని స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 18 స్థానాలు బీజేపీ వశమయ్యాయన్నారు. ఈ ఫలితాలు మళ్లీ పునరావృతం కావడం అసాధ్యమన్నారు. 2024లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనదాని కన్నా తక్కువ స్థానాలకు పరిమితమవడం కచ్చితంగా సాధ్యమేనన్నారు.
గత ఎన్నికల సమయంలో పుల్వామా దాడులు, బాలాకోట్ దాడులు చిట్ట చివరి క్షణంలో బీజేపీకి అద్భుతమైన ప్రభంజనాన్ని సృష్టించాయని చెప్పారు. ఇటువంటి అసాధారణ సంఘటనలు 2024లో పునరావృతం కాబోవన్నారు. అందువల్ల బీజేపీకి 50 స్థానాలు తగ్గడాన్ని, ఆ మేరకు ప్రతిపక్షాలు లాభపడటాన్ని ఊహించవచ్చునని చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఆధిక్యతా స్థానం నుంచి తప్పించి, కలిసికట్టుగా ఉండగలుగుతాయా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం అసాధ్యమని తెలిపారు.
కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాల గురించి మాట్లాడేవారు దేశవ్యాప్తంగా జరుగుతున్నదానిని గమనించాలన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్, బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్, తమిళనాడులో కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్, మహారాష్ట్రలో బాల్ థాకరే కుమారుడు ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే, ఆయన మేనల్లుడు ... ఇలా వారసత్వ రాజకీయాలే కనిపిస్తాయన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 543 స్థానాల్లో 303 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు 52 స్థానాలు లభించాయి.