Share News

Shiva Sena row: ఎమ్మెల్యేల అనర్హతపై మహారాష్ట్ర స్పీకర్‌కు గడువు పొడిగించిన సుప్రీం

ABN , Publish Date - Dec 15 , 2023 | 06:10 PM

ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి శివసేనకు చెందిన రెండు వర్గాల పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విషయంలో మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు మరికొంత గడువు ఇచ్చింది. 2024 జనవరి 10వ తేదీ వరకూ గడువును పొడిగించింది.

Shiva Sena row: ఎమ్మెల్యేల అనర్హతపై మహారాష్ట్ర స్పీకర్‌కు గడువు పొడిగించిన సుప్రీం

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల అనర్హత (MLAs Disqualificaiton)కు సంబంధించి శివసేన (Shiv Sena)కు చెందిన రెండు వర్గాల పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విషయంలో మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ (Rahul Narwekar)కు సుప్రీంకోర్టు (Supreme Court) మరికొంత గడువు ఇచ్చింది. 2024 జనవరి 10వ తేదీ వరకూ గడువును పొడిగించింది. దీనికి ముందు, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం చెప్పేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకూ అత్యున్నత న్యాయస్థానం స్పీకర్‌కు గడువు ఇచ్చింది.


కాగా, పెండింగ్ పిటిషన్లను సమీక్షించేందుకు తనకు మరికొంత గడవు ఇవ్వాలని సుప్రీంకోర్టును రాహుల్ నార్వేకర్ ఇటీవల కోరారు. డిసెంబర్ 20వ తేదీ నాటికి ప్రొసీడింగ్స్ పూర్తవుతాయని స్పీకర్ చెబుతూ, తనకు మరికొంత గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు జనవరి 10వ తేదీ వరకూ సమయం ఇస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ (DY Chandrachud) సారథ్యంలోని ధర్మాసం శుక్రవారంనాడు తెలిపింది.


శివసేన ఉద్ధవ్ ధాకరే వర్గం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీకోర్టు విచారణ జరుపుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని పిటిషన్‌దారులు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.


2022 జూన్‌లో ఏక్‌నాథ్ షిండే పలువురు శివసేన ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతో చేతులు కలపడంతో ఉద్ధవ్ థాకరే శివసేన సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాకరే‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, తమదే అసలైన శివసేన అంటూ షిండే సైతం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఎమ్మె్ల్యేల అనర్హతపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జరుపుతున్న జాప్యంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల పలుమార్లు అసహనం వ్యక్తం చేసింది. డిసెంబర్ 31వ తేదీలోగా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాలని గడువు విధించింది.

Updated Date - Dec 15 , 2023 | 06:12 PM