Air Passenger: విమానంలో మద్యంమత్తు.. పక్క ప్యాసింజర్‌పై మూత్రంపోసిన విద్యార్థి.. చివరికి..
ABN , First Publish Date - 2023-03-05T11:59:49+05:30 IST
ఎయిరిండియా (Air India) విమానంలో ‘ 75 ఏళ్ల పెద్దావిడపై ఓ తాగుబోతు మూత్రవిసర్జన’ చేసిన రీతిలోనే (AirIndia Pee Gate) మరో ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్- న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ (Newyork-new Delhi) విమానంలో ఓ పురుష ప్యాసింజర్‌పై...
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానంలో ‘ 75 ఏళ్ల పెద్దావిడపై ఓ తాగుబోతు మూత్రవిసర్జన’ చేసిన రీతిలోనే (AirIndia Pee Gate) మరో ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్- న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ (Newyork-new Delhi) విమానంలో ఆర్య వోహ్రా (Arya Vohra) అనే 21 ఏళ్ల భారతీయ విద్యార్థి మరో పురుష ప్యాసింజర్‌పై మూత్రం పోశాడు. మద్యం మత్తు, ఆపై నిద్రమత్తులో ఆర్య వోహ్రా ఈ పనికి పాల్పడినట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines), ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ (Delhi Airport) వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఫ్లైట్ నంబర్ AA292లో ఈ ఘటన జరిగిందని తెలిపాయి. కాగా గత శుక్రవారం రాత్రి 9:16 గంటలకు న్యూయార్క్‌లో టేకాఫ్ తీసుకున్న ఈ విమానం 14 గంటల 26 నిమిషాల ప్రయాణం తర్వాత శనివారం రాత్రి 10:12 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI) ల్యాండయ్యిందని అధికారులు చెప్పారు.
మూత్రవిసర్జనకు పాల్పడిన నిందితుడు ఆర్యా వోహ్రా ఒక విద్యార్థి అని, యూఎస్ యూనివర్సిటీలో చదువుతున్నాడని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, నిద్రమత్తులో మూత్రవిసర్జనకు పాల్పడ్డాడని పేర్కొన్నాయి. పక్కనే ఉన్న సహ ప్యాసింజర్‌పై మూత్రం పడడంతో అతడు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశాడని అధికారులు వివరించారు. నిందితుడు ఆర్య క్షమాపణలు చెప్పడంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత ప్యాసింజర్ సుముఖంగా లేడని ఓ అధికారి తెలిపారు. పోలీసు కేసు నమోదైతే తన కెరియర్‌పై దుష్ప్రభావం చూపుతుందని, ఫిర్యాదు చేయవద్దంటూ నిందిత ప్యాసింజర్ బతిమాలుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
వోహ్రాపై నిషేధం...
తోటి ప్యాసింజర్‌పై మూత్రవిసర్జనకు పాాల్పడిన విద్యార్థి ఆర్య వోహ్రాపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ నిషేధం విధించింది. ఆర్యను భవిష్యత్‌లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఎక్కనివ్వబోమని ప్రకటించింది. నిందితుడు బాగా మద్యంమత్తులో ఉన్నాడని, ప్రయాణంలో నిబంధనలను పాటించకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టు తేలిందని ప్రకటనలో పేర్కొంది. కూర్చోవాలని ఎంతచెప్పినా వినకుండా చివరికి సహ ప్రయాణికుడిపై మూత్రపోయడంతో ఈ చర్య తీసుకున్నట్టు వివరించింది.
కాగా మూత్రవిసర్జన వ్యవహారాన్ని బాధిత ప్యాసింజర్ విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు పైలెట్‌కు రిపోర్ట్ చేశారు. పైలెట్ వెనువెంటనే ఏటీసీకి(ATC) సమాచారం అందించాడు. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులను అతడు అప్రమత్తం చేశాడు. దీంతో ఎయిర్‌లైన్స్ సొంత సెక్యూరిటీతోపాటు సీఐఎస్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారని, విమానం ల్యాండయ్యిన వెంటనే నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్స్ తీసుకున్నారని తెలిపారు. కాగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ప్యాసింజర్ విమానంలో దుష్ప్రర్తన పాల్పడితే విమానంలో ప్రయాణించకుండా నిషేధంతోపాటు క్రిమినల్ చట్టాల కింద చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే నేరతీవ్రతను బట్టి శిక్షలు ఆధారపడి ఉంటాయి.