Chariot catches Fire: జగన్నాథ రథోత్సవంలో అపశ్రుతి, విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
ABN , First Publish Date - 2023-06-28T21:02:28+05:30 IST
త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జగన్నాథ రథంపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. 15 మంది గాయపడ్డారు.
ఉనాకోటి: త్రిపుర(Tripura)లోని ఉనాకోటి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జగన్నాథ రథంపై (Chariot) హైటెన్షన్ విద్యుత్ తీగ (High-tension Electric wire) తెగిపడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 15 మంది గాయపడటంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కుమార్‌ఘాట్ ప్రాంతంలో రథయాత్ర ఊరేగింపు జరుగుతుండగా బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
కాగా, ఊరేగింపు సందర్భంగా ఇనుముతో తయారు చేసిన రథాన్ని వందలాది భక్తులు లాగుతుండగా 133 కేవీ ఓవర్‌హెడ్ కేబులు తెగిపడినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, విద్యుదాఘాతంతో రథంపై ఉన్న ఆరుగురు ఆక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. గాయపడిన 15 మందిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. వీరిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు.
సీఎం సంతాపం
రథయాత్ర సందర్భంగా పలువురు మృతి చెందిన ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సహా ఒక ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.