Action Heroine : యాక్షన్‌కు సై
ABN , First Publish Date - 2023-10-21T23:56:51+05:30 IST
కథానాయిక ప్రాధాన్య పాత్రల్లో నటిస్తూ తమకంటూ సొంత మార్కెట్ సృష్టించుకున్నారు కొందరు హీరోయిన్లు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఇప్పటిదాకా తెరపై గ్లామర్

కథానాయిక ప్రాధాన్య పాత్రల్లో నటిస్తూ తమకంటూ సొంత మార్కెట్ సృష్టించుకున్నారు కొందరు హీరోయిన్లు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఇప్పటిదాకా తెరపై గ్లామర్ ఒలికించిన తారలు యాక్షన్ చిత్రాలకూ సై అంటున్నారు. పోరాట ఘట్టాల్లోనూ హీరోగా దీటుగా మెప్పించేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్న కొందరు కథానాయికలు వీరే.
బాలీవుడ్ చిత్రాల్లోనే కాదు హాలీవుడ్‌లోనూ ‘ట్రిపుల్ ఎక్స్’ చిత్రంతో తనలోని యాక్షన్ స్టార్‌ను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేశారు దీపికా పదుకోన్. ఓ వైపు రెగ్యులర్ చిత్రాలు చేస్తూనే తనలోని యాక్షన్ ఇమేజ్‌ను కొనసాగించే సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ‘పఠాన్’ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌తో కలసి పాక్ గూఢచారిణిగా శత్రువులతో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు దీపిక. ఇప్పుడు ‘సింగం ఎగైన్’ చిత్రంతో మరోసారి రంగంలోకి దిగారు. ఈ చిత్రంలో ఆమె పోలీస్ అధికారిగా తన ప్రతాపం చూపనున్నారు. అలాగే ప్రభాస్ సరసన నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలోనూ ఆమె యాక్షన్ పాత్రలోనే అలరించనున్నారు.
ఐఎస్‌ఐ ఏజెంట్‌గా
దీపికా పదుకోన్ తర్వాత బాలీవుడ్‌లో యాక్షన్ పాత్రలను అద్భుతంగా పోషించిన కథానాయికగా కట్రినాకైఫ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జిందగీ నా మిలేగీ దుబారా’, ‘ఏక్ థా టైగర్’, పాంటమ్, బ్యాంగ్ బ్యాంగ్, టైగర్ జిందాహై’ చిత్రాల్లో ఈ తరహా పాత్రలను పోషించి శభాష్ అనిపించుకున్నారు. సల్మాన్‌ఖాన్ ‘టైగర్ 3’ చిత్రంతో మరోసారి ఆమె ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఐఎ్‌సఐ ఏజెంట్ జోయా పాత్రలో కట్రినా కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభించటానికి ముందు కట్రినా సౌత్ కొరియాకు చెందిన స్టంట్ మాస్టర్ల దగ్గర 14 రోజుల శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో కట్రినా నటన ఆకట్టుకుంటుందని బాలీవుడ్ టాక్.
కృతీసనన్- గణపత్
కెరీర్ ఆరంభం నుంచి చక్కని ప్రేమకథాచిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కృతీసనన్. ఈ మధ్య రూట్ మార్చి యాక్షన్ బాట పట్టారు. టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘గణపత్’ చిత్రంలో ఆమె పూర్తి స్థాయి యాక్షన్ రోల్ చేస్తున్నారు. బైక్ స్టంట్స్, చేజింగ్ సీక్వెన్స్‌లో కృతీ అద్భుతంగా నటించారని చిత్రబృందం తెలిపింది.
కంగనా రనౌత్ - తేజ్‌స
కథానాయిక ప్రాధాన్య పాత్రల్లో నటిస్తూ తనకంటూ సొంత మార్కెట్ సృష్టించుకున్నారు కంగనా రనౌత్. ‘ధాక్కడ్’, ‘మణికర్ణిక’ లాంటి చిత్రాల్లో తన ఫైట్స్‌తో ప్రేక్షకుల మెప్పు పొందారు. వైవిధ్యమున్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కంగన సినిమాల జాబితాలో ఎప్పుడూ ఒక యాక్షన్ చిత్రం ఉంటుంది. ఈ సారి ఆమె ‘తేజస్’ చిత్రంతో యుద్ధ విమాన పైలెట్‌గా కనిపించనున్నారు. తన పాత్ర కోసం నాలుగు నెలల పాటు కంగన పలు యుద్ధ విద్యలో తర్ఫీదు అయ్యారు.
రివాల్వర్ రీటా
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా కెరీర్‌ను నిలకడగా కొనసాగిస్తున్నారు కీర్తిసురేశ్. అవకాశం దొరికినప్పుడు కథానాయిక ప్రాధాన్య చిత్రాలు చేస్తూ తనలోని నటిని కొత్తగా పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’పై ఆసక్తి నెలకొంది. ఇందులో కీర్తి పాత్ర సరికొత్తగా ఉండబోతోందని, ఆమెకు యాక్షన్ హీరోయిన్ ఇమేజ్ దక్కడం ఖాయం అని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా కోసం ఆమె సన్నద్ధమవుతున్నారు.
సరికొత్త సత్యభామ
సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తనలోని యాక్షన్ ఇమేజ్‌ను వెలికితెచ్చే పాత్రలను ఎంచుకుంటున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘సత్యభామ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ‘భారతీయుడు 2’ చిత్రంలో కమల్‌హాసన్‌కు జోడీగా ఆమె కనిపించనున్నారు. ఇందులో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఫైట్స్‌లో కాజల్ నటన ఆకట్టుకోనుందని సమాచారం.
రెజీనా, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మరీచిక’. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో రెజీనా, అనుపమ తమ ఫైట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. హన్సిక లీడ్‌రోల్‌లో రూపొందిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ చిత్రం మాఫియా నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమాలో హన్సిక పోరాట ఘట్టాల్లో తనదైన శైలిలో అలరించనున్నారు. ‘బాహుబలి’ చిత్రంతో తనలోని యాక్షన్ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు అనుష్క. కొంత గ్యాప్ తర్వాత ఇటీవలే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ఆమె ఓ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఇది యాక్షన్ నేపథ్యంలోనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ‘జవాన్’ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో యాక్షన్ పండించారు నయనతార. ఇప్పుడు ఆమె ఆర్మీ నేపథ్యంలో సాగే ఓ తమిళ చిత్రానికి ఎస్ చెప్పారట. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె సైనికురాలి పాత్రలో కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘తంగలాన్’ చిత్రంలో కీలకపాత్రలో కనిపిస్తున్నారు మాళవికా మోహనన్. ఇందులో ఆమె సంప్రదాయ యుద్ధ విద్యల్లో ఆరితేరిన యోధురాలి పాత్రలో కనిపించనున్నారు.