Sonali Saini : వారికి గౌరవమైన జీవితం దక్కాలని..
ABN , First Publish Date - 2023-09-13T02:28:55+05:30 IST
‘అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే రాజ్యాంగ లక్ష్యం ప్రత్యేక అవసరాలున్న వారి విషయంలో నెరవేరడం లేదు’ అంటారు సోనాలీ సైనీ.

‘అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే రాజ్యాంగ లక్ష్యం ప్రత్యేక అవసరాలున్న వారి విషయంలో నెరవేరడం లేదు’ అంటారు సోనాలీ సైనీ. ఆ లక్ష్యం సాకారం కావడానికి తనవంతుగా... వివిధ వైకల్యాలు కలిగిన పిల్లలకు విద్య, నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం ఇరవయ్యేళ్లుగా ఆమె కృషి చేస్తున్నారు. సోనాలీ నేతృత్వంలో ముంబయి కేంద్రంగా నడుస్తున్న ఎన్జీవో లక్షలాది జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చింది.
‘‘వైకల్యాలు ఉన్న పిల్లలకు భిన్నమైన విద్యావసరాలు ఉంటాయి. మామూలు పాఠశాలల్లో వాటిని నెరవేర్చే పరిస్థితి దాదాపు శూన్యం. అంతేకాదు, ఇటువంటి పిల్లల గురించి మన సమాజంలో అవగాహన చాలా తక్కువ. వారి కోసం ప్రత్యేక బోధనా పద్ధతులు మన విద్యా వ్యవస్థలో కనిపించవు. వారిలోనూ అత్యంత ప్రతిభావంతులు ఉన్నారు. ఆ ప్రతిభను వెలికి తీసే అవకాశాలు కనీస స్థాయిలో కూడా లేవు. ఇవన్నీ నన్ను చాలాకాలం ఎంతగానో కలవరపెట్టాయి. మాది ముంబయి. టీచర్ కావాలి. సమాజానికి సేవ చెయ్యాలి. ఇది నా చిన్నప్పటి కల. అందుకే ‘స్పెషల్ ఎడ్యుకేషన్’లో మాస్టర్స్ డిగ్రీ, సోషల్ ‘ఎంటర్‌ప్రెన్యూర్’షిప్‌లో మేనేజిమెంట్ డిగ్రీ చేశాను. అధ్యాపకురాలుగా నా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టాను. మరోవైపు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేదాన్ని.
అలా బీజం పడింది...
ఒక రోజు... నేను పని చేస్తున్న స్కూల్‌లో తన కుమార్తెను చేర్చడానికి ఒక మహిళ వచ్చారు. ఆటిజం సమస్య ఉన్న ఆ అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వలేమని స్కూల్ యాజమాన్యం చెప్పింది. ఆ తల్లితో నేను మాట్లాడాను. ‘‘ఇప్పటికి ఎన్నో స్కూళ్ళు తిరిగాను. ఎవరూ చేర్చుకోవడం లేదు’’ అంటూ ఆమె బాధపడ్డారు. ఆమె మా ఇంటికి దగ్గర్లోనే ఉంటారని తెలిసింది. ఆ అమ్మాయికి ప్రాథమికమైన అంశాలు నేర్పుతానని చెప్పాను. కానీ అది చాలా కష్టమని ఆ తరువాత గ్రహించాను.. రోజూ నేను బడిలో బోధించే తీరులో పాఠాలు చెబితే... ఆ పిల్లకు అర్థం కాదు. వైకల్యాలున్న పిల్లల కోసం ప్రత్యేకమైన బోధన పద్ధతులు లేవు. దీని గురించి నేను ఆలోచించినప్పుడు సమస్యకు మూలం అర్థమయింది. ప్రతి తరగతిలో రకరకాల అభ్యాస స్థాయిలు కలిగిన పిల్లలుంటారు. వారందరికీ టీచర్ ఒకేలా బోధిస్తారు. గ్రహణశక్తి ఎక్కువగా ఉన్న పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. అది లేనివారు వెనుకబడతారు. మన విద్యావిధానం అధ్యాపకులు కేంద్రంగా నడుస్తోంది తప్ప పిల్లల భిన్నమైన అవసరాలకు తగినట్టు కాదు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. మరి ఈ పిల్లలకు అవి కల్పించాలంటే ఏం చెయ్యాలి? మిత్రులతో చర్చించినప్పుడు... అటువంటి చొరవ నేనే ఎందుకు తీసుకోకూడదనిపించింది. అలా 2003లో ‘సోల్స్ ఆర్క్’ ఎన్జీవోకు బీజం పడింది.
ప్రత్యేక బోధనా విధానంతో...
వైకల్యాల కారణంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు విద్య, నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలు కల్పించడం మా సంస్థ లక్ష్యం. మూడేళ్ళకు పైబడిన పిల్లలను దీనిలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. వారి బోధన, సంరక్షణ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశా. విద్యా, స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రుల ద్వారా... వైకల్యాలున్న పిల్లల వివరాలు సేకరించాం. వారి తల్లితండ్రులతో మాట్లాడి... మా కేంద్రంలో చేర్చేలా ఒప్పించాం. హిందీ, ఇంగ్లీషు, మరాఠీ భాషలను, లెక్కలను చిన్న అభ్యాసాలు, ఆటలు, పాటల ద్వారా వారికి నేర్పించడానికి ప్రత్యేక బోధనా విధానాన్ని తయారు చేసుకున్నాం. ఏడాది తరువాత... మా కేంద్రంలో ప్రాథమిక అంశాలు నేర్చుకున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాం. అక్కడ మిగిలిన పిల్లలతో సమానంగా వాళ్ళు చదువుకోగలుగుతున్నారా? అనేది పరిశీలించినప్పుడు... మా ప్రయత్నం ఫలించిందని తేలింది. క్రమంగా కేంద్రంలోని పిల్లల సంఖ్యా పెరిగింది. ఇప్పుడు ముంబయి, పుణేల్లో మూడు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో వెయ్యి మందికి పైగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలున్న పిల్లల కోసం పని చేస్తున్న అనేక సంస్థలకు గత ఇరవయ్యేళ్ళుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల మంది పిల్లలు మా సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, ఎన్జీవోలు, రాష్ట్ర ప్రభుత్వాలతో మా భాగస్వామ్యాల ద్వారా దాదాపు పదిహేడు లక్షల మంది ప్రయోజనం పొందారు. మరోవైపు వైద్య శిబిరాలు, అవగాహన సదస్సుల్లాంటివి కూడా నిర్వహిస్తున్నాం. శారీరకమైన వైకల్యాలు ఉన్నవారికి ఉపకరణాలు అందజేస్తున్నాం.
అది ఊహించలేదు...
ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు విద్య, నైపుణ్యాలు నేర్పడం ఒక ఎత్తయితే... ఉపాధి కల్పన మరో ఎత్తు. దీని కోసం ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, వివిధ పరిశ్రమలను ఎప్పటికప్పుడు సంప్రతిస్తూనే ఉంటాం. మరోవైపు స్వయం ఉపాధికి కావలసిన సాయాన్ని సమకూరుస్తున్నాం. ఇలా కొన్ని వేలమంది జీవితాల్లో స్థిరపడ్డారు. ఇటీవల యాభై ముగ్గురికి అమెజాన్‌లో ఉద్యోగాలు వచ్చాయి. మరో నూట యాభై మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. ‘ప్రాజెక్ట్ సమావేశ్’, ‘ప్రాజెక్ట్ అంకుర్’, ‘రూరల్ లైవ్లీహుడ్ మిషన్’ తదితర ప్రాజెక్టుల్ని కూడా మా సంస్థ నిర్వహిస్తోంది. విద్య, జీవనోపాధి, గౌరవప్రదమైన జీవనం.. ఇవి అందరికీ దక్కాలన్నదే మా తపన. మా ఎన్టీవోను ప్రారంభించినప్పుడు... ఇన్ని జీవితాలను ప్రభావితం చేస్తామనీ, ఇంతమందికి సాయం అందించగలమనీ ఊహించలేదు. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నాం. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు అందిస్తున్న విరాళాలతో మా కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలోని పిల్లలందరికీ మా సేవలు చేరాలన్నది నా తపన. అందుకోసం నాతో పాటు పని చేస్తున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి కృషిచేస్తూనే ఉంటాను.’’