రిస్క్ తీసుకొని సర్జరీ చేశా
ABN , First Publish Date - 2023-09-12T00:03:15+05:30 IST
‘‘కేన్సర్ ఒక భయంకరమైన వ్యాధి. ఇది చూస్తుండగానే ఒక భాగం నుంచి మరొక భాగానికి పాకుతుంది. కొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించాల్సి వస్తుంది...
చాలా మంది చిన్న ఆరోగ్య సమస్య వస్తే చాలు- కుంగిపోతారు. నిరాశ చెందుతారు. కానీ కొందరు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అపారమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరికి ఆదర్శంగా నిలుస్తారు. ప్రతి వైద్యుడి జీవితంలో అలాంటి కొన్ని అనుభవాలు ఉంటాయి. అనేక వేల మంది పేదవాళ్లకు కేన్సర్ చికిత్సను అందించిన వైద్యుడిగా పేరుగాంచిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఈ వారం తన అనుభవాలను ‘డాక్టర్’తో పంచుకున్నారు.
‘‘కేన్సర్ ఒక భయంకరమైన వ్యాధి. ఇది చూస్తుండగానే ఒక భాగం నుంచి మరొక భాగానికి పాకుతుంది. కొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించాల్సి వస్తుంది. శరీరంలో ఒక అవయవం పోతే- అది మళ్లీ జీవించి ఉండగా తిరిగి రాదు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడిన ఒక యువకుడి గురించి చెబుతాను. ఈ మధ్య నేను మా ఊరు వెళ్లినప్పుడు ఒక దివ్యాంగుడు వచ్చి కలిసాడు. ఎంతో కృతజ్ఞతతో - ‘‘25 ఏళ్ల క్రితం మీరు నన్ను బతికించారు. ఇప్పుడు నేను నాగాయలంకలో మేస్త్రీగా పనిచేస్తున్నా. నా దగ్గర నలుగురు పనివారు కూడా ఉన్నారు..’’ అన్నాడు. అప్పటిదాకా అతనికి నేను సర్జరీ చేశాననే విషయం కూడా నాకు గుర్తులేదు. ఒక్క సారి గతాన్ని తవ్వితే - అతని కేసు గుర్తుకొచ్చింది. 1998లో అనుకుంటా. ఎంఎన్‌జే కేన్సర్ సెంటర్‌లో పనిచేస్తున్నా. ఒక 25 ఏళ్ల యువకుడు కేన్సర్‌తో నా దగ్గరకు వచ్చాడు. అతనికి తుంటి దగ్గర పెద్ద కేన్సర్ గడ్డ ఏర్పడింది. ఆ గడ్డ అప్పటికే బాగా పెరిగిపోయింది. దానిని వదిలేస్తే- మిగిలిన భాగాలకు పాకుతుంది. అప్పుడు ఎవరూ ఏమి చేయలేరు. ప్రాణాలకే ప్రమాదం. తుంటిలో కొంత భాగాన్ని.. ఒక కాలును మొత్తంగా తొలగిస్తే- అతను బతికే అవకాశాలుంటాయి. అయితే అది కూడా చాలా రిస్క్‌తో కూడా సర్జరీనే! 25 ఏళ్లు అంటే- చిన్న వయస్సు. ఇంకా పెళ్లి కూడా కాలేదనుకుంటా! సర్జరీ చేస్తే జీవితాంతం దివ్యాంగుడిలా బతకాలి. సర్జరీ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. చాలా సందర్భాలలో- పేషెంట్ల బంధువులకు సర్జరీలో ఉన్న రిస్క్ గురించి ముందుగానే చెబుతాం. వారిని రోగికి నెమ్మదిగా పరిస్థితిని వివరించమని చెబుతాం. ఎందుకంటే సర్జరీలో ఉన్న రిస్క్‌ల గురించి చెబితే- రోగి ముందే కంగారుపడతాడు. కొందరైతే సర్జరీ చేయించుకోవటానికి తిరిగిరారు. ఈ యువకుడి విషయంలో నాకు కొంత సందిగ్దత ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో -ఆ యువకుడికి సర్జరీలో ఉన్న రిస్క్ గురించి చెప్పా. 25 ఏళ్ల క్రితం- క్యాన్సర్ చికిత్స ఇప్పుడున్నంతగా అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతం ఉన్నన్ని యంత్రాలు.. కచ్చితత్వం కూడా ఉండేది కాదు. అయినా ఆ యువకుడు ధైర్యంగా సర్జరీ చేయించుకోవటానికి ముందుకు వచ్చాడు. అతనికి తుంటిలో కొద్ది భాగం... ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అతనిని చూస్తే నాకు జాలేసింది. ఎంతో జీవితం అతని ముందు ఉంది. అతను ఆ జీవితాన్ని ఎలానెగ్గుగొస్తాడా అనుకున్నా.మళ్లీ కేసుల హడావిడి.. బిజీలో పడిపోయా! ఈ 25 ఏళ్లలో అతను నాకు ఎప్పుడూ గుర్తురాలేదు. మొన్న హఠాత్తుగా కనిపించేసరికి చాలా ఆనందంగా అనిపించింది. ఒక కాలుపోయినా అధైర్యపడకుండా- పని చేసుకుంటున్న అతని కథ చాలా మందికి స్పూర్తిగా నిలుస్తుందనుకుంటున్నా. ధనికులకు కేన్సర్ వంటి జబ్బు వస్తే- సాయం చేయటానికి ఎవరో ఒకరు ఉంటారు. ఖర్చు కూడా పెట్టగలుగుతారు. కానీ కేన్సర్ పేదవారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసేస్తుంది. వారు ఎంతో కష్టపడి కూడాపెట్టుకున్న దాచుకున్న సొమ్మును ఆవిరి చేసేస్తుంది. భవిష్యత్తు మీద ఆశ లేకుండా చేసేస్తుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని పోరాడటం.. ఒక కాలు లేకపోయినా- సొంతకాళ్లమీదే నిలబడాలని కష్టపడి పనిచేయటం ఒక గొప్ప విషయమనే చెప్పాలి.