Great leader Mose : మహా నాయకుడు మోషే
ABN , First Publish Date - 2023-08-24T23:45:36+05:30 IST
ఏసు క్రీస్తుకు పూర్వం ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. భక్తులు ఉన్నారు. వారందరూ యెహోవా దేవుని వాగ్దానం ప్రకారం... పుట్టబోయే క్రీస్తు ఉనికిని తమ సూచనల ద్వారా, చర్యల ద్వారా తెలియజేశారు. ఆ ప్రవక్తలలో జనం తరఫున పోరాడిన నాయకులూ ఉన్నారు. ప్రజలను ప్రేమించి, వారిని

ఏసు క్రీస్తుకు పూర్వం ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. భక్తులు ఉన్నారు. వారందరూ యెహోవా దేవుని వాగ్దానం ప్రకారం... పుట్టబోయే క్రీస్తు ఉనికిని తమ సూచనల ద్వారా, చర్యల ద్వారా తెలియజేశారు. ఆ ప్రవక్తలలో జనం తరఫున పోరాడిన నాయకులూ ఉన్నారు. ప్రజలను ప్రేమించి, వారిని బాధల బంధాల నుంచి తప్పించి, మహోజ్వలమైన బాటలో నడిపించి, ఈ ప్రయత్నంలో ఎదురయ్యే అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచిన మోషే అటువంటి వ్యక్తి. అతను బైబిల్‌లోని పాత నిబంధన కాలంలో... క్రీస్తుకు ముందు ప్రజా జీవన కథలో కనిపించే మహా నాయకుడు.
ఆ కాలంలో ఐగుప్తును ఫరో రాజులు పాలించేవారు. చాలా బలవంతులైన ఫరో రాజులు... కానాను దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల మీద దాడి చేశారు. వారిని బందీలుగా తమ కోటకు తీసుకువచ్చారు. వారితో చాకిరీ చేయించుకొనేవారు. ఈ విధంగా ఇశ్రాయేలీయ ప్రజలు ఐగుప్తులో బానిసలయ్యారు. ఆ బానిసల సంఖ్య లక్షల సంఖ్యలో ఉండేది. ఇలా బందీలుగా వెళ్ళి, దాస్యంలో ఉన్న బానిస తల్లితండ్రులకు పుట్టినవాడు మోషే. అతని తల్లి జొఖేబిదా, తండ్రి ఆమ్రాం. ఆనాటి భయానకమైన పరిస్థితులలో.. తన బిడ్డ తమ కళ్ళ ఎదుటే బానిసగా బతకకూడదని మోషే తల్లి భావించింది. రాజ కుమార్తె చూసేట్టుగా... మూడు నెలల పసికందు అయిన మోషేను నైలు నదీ ప్రవాహంలో మెల్లగా జారవిడిచింది. ఆ రాజ కుమార్తె పేరు బితియా. చెలికత్తెలతో స్నానానికి వచ్చిన ఆమె... చిన్నారి మోషేని గమనించి, నీటిలోంచి అతణ్ణి బయటకు తీసింది, ఎత్తుకొని ముద్దాడింది. ప్రేమతో పెంచింది.
ఇప్పుడు మోషే... ఐగుప్తు కోటలో రాజకుమారుడు. అతను పరిసరాలను గమనించాడు. అవగాహన పెంచుకున్నాడు. తనవారు తన కోటలోనే బానిసలుగా ఉన్నారని తెలుసుకున్నాడు. దైవబలంతో వారిని విడిపించాడు. తమ మాతృదేశమైన కానానుకు బయలుదేరాడు. దారిలో ఐగుప్తు సేనలు వారిని అటకాయించాయి. అయినప్పటికీ... మోషే తన వారిని ఎర్ర సముద్రం దాటించి ఒక అద్భుతమే చేశాడు. తరువాత నలభై ఏళ్ళపాటు తన ప్రజలతో కొండా కోనల్లో ప్రయాణం సాగించాడు. ఆ సమయంలోనే... ప్రజలు నైతికంగా జీవించడానికి పది ఆజ్ఞలను మోషే ద్వారా దేవుడు అందించాడు.
బైబిల్‌లోని మొదటి అయిదు గ్రంథాలు పాత నిబంధనకు పంచ ప్రాణాలలాంటివి. మోషేయే వాటి కృతికర్త. వీటి సంకలనాన్ని ‘తొరహ్’ అంటారు. బోధనకు, నియమ నిష్టలకు సంబంధించిన సూచనా గ్రంథమైన ‘తొరహ్’ రచన హీబ్రూ భాషలో జరిగింది. యూదా మతానికి ఇది ప్రామాణికమైన గ్రంథం.
ఫ డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు
9866755024