H-1B Visa: భారతీయులారా ఆందోళన వద్దు.. ఉద్యోగాలు పోతున్నా.. ఇంకా అవకాశాలున్నాయి
ABN , First Publish Date - 2023-02-01T07:27:52+05:30 IST
అమెరికాలో ఐటీ సంస్థలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నా హెచ్-1బీ వీసాదారులు ఆందోళన చెందవద్దని ఆ దేశంలో స్థిరపడ్డ ఇమిగ్రేషన్ అటార్నీ మధురిమ బోయపాటి అన్నారు.
హెచ్-1బీ వీసాదారులూ.. ఆందోళన వద్దు
ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి
ఎఫ్-1, హెచ్-4 వీసాలు పొందడం సులభమే
మార్చి-1 నుంచి హెచ్-1బీ కొత్త లాటరీ విధానం
ఉద్యోగాలు పోతున్నా.. కొత్త అవకాశాలున్నాయి
‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో
అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ మధురిమ బోయపాటి
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఐటీ సంస్థలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నా హెచ్-1బీ వీసాదారులు ఆందోళన చెందవద్దని ఆ దేశంలో స్థిరపడ్డ ఇమిగ్రేషన్ అటార్నీ మధురిమ బోయపాటి అన్నారు. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైనవారు 60 రోజుల్లో మరో ఉద్యోగంలో చేరడం, లేదంటే దేశాన్ని వీడి వెళ్లడమే కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని చెప్పారు. అమెరికాలో ఉద్యోగాల తొలగింపు అక్కడ పెద్దసంఖ్యలో ఉన్న భారతీయులను కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి, ప్రత్నామ్నాయ అవకాశాలను మధురిమ బోయపాటి ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఈమె అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) న్యాయ సలహాదారుగా సేవలందిస్తున్నారు. ఇంటర్వ్యూ విశేషాలు..
హెచ్-1బీ వీసాదారులు 60 రోజుల్లో మరో ఉద్యోగంలో చేరడం తప్ప ప్రత్యామ్నాయం లేదా?
అదేం లేదు. ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ప్రస్తుతం మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. 60 రోజుల్లోపు మరో ఉద్యోగాన్ని వెతుక్కుని హెచ్-1బీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఒకటి కాగా, ‘చేంజ్ ఆఫ్ స్టేటస్’ మరొకటి, చివరిది దేశాన్ని వీడడం.
నిర్దిష్ట సమయంలో ‘చేంజ్ ఆఫ్ స్టేటస్’ సాధ్యమేనా? ఇందులో ఉన్న సమస్యలేంటి?
దీనికోసం ప్రస్తుత స్టేటస్ నుంచి ఇంకో స్టేట్‌సకు మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. హెచ్-1బీ స్టేటస్ ఉన్నవారు చదువుకోవాలంటే ఎఫ్-1కి మారవచ్చు. భార్యాభర్తలిద్దరికీ హెచ్-1బీ వీసా ఉండి.. ఒకరి ఉద్యోగం పోతే మరొకరు డిపెండెంట్‌గా హెచ్-4 వీసాకు మారవచ్చు. ఇవే కాకుండా బిజినెస్ కోసం బీ-1, వైద్యపరమైన సమస్యలు ఉంటే విజిటర్‌గా బీ-2 వీసాకు మార్చుకోవచ్చు. అయితే ఇందులో హెచ్-4, కాలేజీలో ప్రవేశం పొందితే ఎఫ్-1 వీసా పొందడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, బీ-1, బీ-2 పొందడం సులభం కాదు. దీనికోసం సరైన కారణాలు, ఆధారాలు చూపాల్సి ఉంటుంది.
కనీసం నెల రోజులైనా గడువు ఇవ్వకుండా.. ఒకేసారి వేలాది మంది ఉద్యోగులను కంపెనీలు అకస్మాత్తుగా తొలగించడాన్ని అమెరికన్ చట్టాలు సమర్థిస్తాయా.?
అమెరికాలో ఉద్యోగుల హక్కులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో చట్టాలు వేర్వేరుగా ఉంటాయి. ఇందులో చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం.. నియామక సమయంలో కంపెనీతో ఉద్యోగి కుదుర్చుకునే ఒప్పందం. ‘ఎట్ విల్ రిస్క్’ అని నియామక ఒప్పందంలోనే స్పష్టంగా పేర్కొంటారు. అంటే ఎలాంటి కారణాలు లేకుండానే ఉద్యోగిని తొలగించే హక్కు కంపెనీలకు ఉంటుంది. ఈ నిబంధన ధైర్యంతోనే కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
భారత్ నుంచి వెళ్లిన హెచ్-1బీ వీసాదారులకు ఉద్యోగ భద్రత, చట్టపరమైన రక్షణ వర్తించవా?
హెచ్-1బీ అంటేనే నాన్ ఇమిగ్రెంట్ వీసా.. తాత్కాలిక వీసా. శాశ్వత పౌరసత్వం గ్రీన్‌కార్డ్ కలిగినవారికి ఉన్న హక్కులు వీరికి ఉండవు. పనిచేసేందుకు వచ్చినందున పని కోల్పోతే వెళ్లాల్సిందే. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందన్న ఆలోచనతో ఉద్యోగులు ముందుగా కంపెనీ ఒప్పందాన్ని చూసుకోవాలి. తొలగిస్తే నోటీస్ పీరియడ్ ఉందా? ఎన్ని రోజుల వేతనాన్ని నష్టపరిహారంగా ఇస్తారు? అన్న విషయాలనూ తెలుసుకోవాలి.
భారత నిపుణులతో పోలిస్తే ఇతర దేశాల హెచ్-1బీ వీసాదారులకు అమెరికన్ నిబంధనల్లో ఏమైనా మార్పులు, ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
హెచ్-1బీ నిబంధనలు యూఎస్ ఇమిగ్రేషన్ చట్టాలకు లోబడి ఉంటాయి. ఏ దేశం నుంచి వచ్చినా అందరికీ ఒకే నిబంధనలు ఉంటాయి. ఎవరైనా సరే 60 రోజులే అవకాశం ఉంటుంది. అయితే వీటిని భారత్, చైనా ఎక్కువగా వినియోగిస్తున్నందున.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావం కూడా ఈ రెండు దేశాల పౌరులపైనే ఎక్కువగా పడుతోంది. యూరోపియన్, దక్షిణ అమెరికా దేశాలు, కెనడా, మెక్సికో నుంచి వచ్చినవారికి మాత్రం భారత పౌరులతో పోలిస్తే ఉద్యోగం కోల్పోయాక వెసులుబాట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాలకు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ఎక్కువగా ఉన్నందున.. అక్కడి పౌరులకు 60 రోజుల గడువులో ఇతర ప్రత్యామ్నాయాలు అదనంగా ఉన్నాయి. వీరు వాణిజ్య దేశానికి చెందిన పౌరులుగా వాణిజ్య వ్యాపార వీసా ఈ-1, వాణిజ్య పెట్టుబడుదారీ వీసా ఈ-2 పొందవచ్చు. అలాగే కెనడా, మెక్సికో పౌరులు అమెరికాలో హెచ్-1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే టీఎన్ నాఫ్తా (నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) వీసాలు కూడా పొందవచ్చు.
2008 ఆర్థికమాంద్యంతో పోలిస్తే.. యూఎస్ఏలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
అప్పట్లో ఆర్థిమాంద్యం చాలా తీవ్రంగా ఉంది. ఈసారి అంత తీవ్రంగా లేకపోయినా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓవైపు ఉద్యోగాలు పోతున్నా కొత్త ఉద్యోగాల కోసం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మార్చి 1-17 వరకు హెచ్-1బీ కొత్త లాటరీ విధానం జరగబోతోంది. దీంతో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఉద్యోగం కోల్పోయినవారు స్వదేశానికి వెళ్లిపోయి మళ్లీ ప్రయత్నించుకోవచ్చు ఒకసారి హెచ్-1బీకి ఎంపికైతే ఆరేళ్ల గడువు ఉంటుంది. స్వదేశానికి వెళ్లి మళ్లీ లాటరీ అవసరం లేకుండానే ఉద్యోగం వెతుక్కుని అమెరికా రావచ్చు.