Saudi Arabia: సౌదీలోని తెలుగు ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 14న తబూక్‍లో..!
ABN , First Publish Date - 2023-12-11T13:56:23+05:30 IST
సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న కొందరు ప్రవాసుల్లో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్‍లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.
పొట్టకూటి కోసం, కుటుంబ కష్టాలను తీర్చడం కోసం గల్ఫ్ దేశాల బాట పట్టిన ప్రవాసులు ఏడాదికి ఒక్కసారి కూడా సొంతూళ్లకు తిరిగి రావడానికి వీలు ఉండదు. కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చినప్పుడల్లా పక్కనున్న సాటి ప్రవాసులే సొంత వాళ్లవుతారు. అక్కున చేర్చుకుంటుంటారు. సొంతూళ్లకు వెళ్లలేకపోయినా.. సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న ఆలోచన కొందరిలో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్‍లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.
ఇస్లాం మతానికి పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియా ఇటీవల కాలంలో ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తోంది. సౌదీ విజన్ 2030 కింద సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పలు సంస్కరణలు చేపడుతోంది. సామాజిక మార్పులతో పాటు ఆర్థిక వ్యవస్థను చమురేతర ఆదాయ వనరుల వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగానే నియోం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. వాయువ్య సౌదీ అరేబియాలో ఈజిప్టు, జోర్డాన్ దేశాల సరిహద్దులలో ఉన్న తబూక్ ప్రాంతంలోనే నియోం, రెడ్ సీ, అమలా మరియు ఇతర అధునీక సాంకేతిక పరిజ్ఞాన ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. ప్రఖ్యాత నియోం ప్రాజెక్టుకు నెలవుగా ఇప్పడు ఒక్క సౌదీలోనే కాదు దేశవిదేశాల్లో కూడా విస్తృతంగా చర్చించుకుంటున్న పేరు తబూక్.
సౌదీ అరేబియాలో వ్యవసాయ పురోగతికి మారుపేరు అయిన ఈ ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యావన క్షేత్రాలతోపాటు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఎముకలు కొరికే చలికి, మండే ఎండల ఎడారులకు కూడా తబూక్ ప్రసిద్ధి. ఇస్లాం కంటె మందు ఉన్న ఈ ప్రాంతంలో ప్రవక్త మూసా (మోసే) కూడా చాల కాలం గడిపారని చరిత్ర చెబుతోంది. అదే విధంగా ఇదే ప్రాంతంలోని తయిమాలో ఏసు క్రీస్తు కూడా గడిపారని క్రైస్తవుల విశ్వాసం. ప్రవక్త మోహమ్మద్ తన జీవిత కాలంలో చేసిన తబూక్ యుద్ధం కూడా ఇస్లాంలో చెప్పుకోదగింది. ఈ రకంగా మూడు అబ్రహం ధర్మాలలో కూడా తబూక్ ప్రస్తావన ఉంది.
ఈ రకమైన చారిత్మాక నేపథ్యం కల్గిన తబూక్‍లో నియోం మరియు ఇతర ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల వల్ల అనేక మంది విదేశీయులతో పాటు భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో పని చేయడానికి వస్తున్నారు. అందులో అనేక మంది తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు కూడా ఉన్నారు. మామూలు కార్మికుల నుంచి ఉన్నత ఉద్యోగాలు చేసే టెక్నిషియన్స్ వరకు.. అనేక మంది తెలుగు వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఒక ప్రాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు మధ్య చాలా దూరం ఉండడంతో తెలుగు ప్రవాసీయులందరూ ఒకేసారి కలవడం కష్టమవుతోంది. తెలుగు వారి మధ్య ఆత్మీయత కొరవడుతోంది.
ఈ నేపథ్యంలో తబూక్ ప్రాంతంలోని తెలుగు ప్రవాసీయులందర్ని కులమతాలతో సంబంధం లేకుండా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని కొందరు తెలుగు ప్రముఖులు నిర్ణయించారు. ఇందుకోసం సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా తన వంతుగా ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం డిసెంబర్ 14 వ తారీఖున తబూక్ పట్టణంలో తెలుగు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడానికి నిర్ణయించినట్లుగా సాటా అధ్యక్షులు మల్లేషన్, తబూక్ ప్రతినిధి తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకు 0580160669 లేదా 0597384449 నెంబర్లలో సంప్రదించవచ్చని వివరించారు. తబూక్ ప్రాంత పరిధిలో ఉన్న తెలుగు ప్రవాసులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా సాటా పిలుపునిచ్చింది.