TS Congress : పొంగులేటిని ఒప్పించి కాంగ్రెస్‌లో చేరికకు చక్రం తిప్పిన ఈ ‘పెద్దాయన’ ఎవరబ్బా.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. హీరో వెంకటేష్‌కు ఏంటి సంబంధం..!?
ABN , First Publish Date - 2023-06-27T16:28:49+05:30 IST
పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy).. నిన్న, మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాలు (TS Politics) ఈయన చుట్టూనే తిరిగాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి బహిష్కరించిన తర్వాత పొంగులేటి, జూపల్లి కృష్ణారావులను (Jupally Krishna Rao) కాషాయ కండువా కప్పాలని కమలనాథులు, హస్తం గూటికి చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) విశ్వప్రయత్నాలు చేశారు..
పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy).. నిన్న, మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాలు (TS Politics) ఈయన చుట్టూనే తిరిగాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి బహిష్కరించిన తర్వాత పొంగులేటి, జూపల్లి కృష్ణారావులను (Jupally Krishna Rao) కాషాయ కండువా కప్పాలని కమలనాథులు, హస్తం గూటికి చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) విశ్వప్రయత్నాలు చేశారు. మొదట బీజేపీలో చేరాలని సర్వం సిద్ధం చేసుకున్నప్పటికీ కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత కూడా సంప్రదింపులు జరిగినప్పటికీ బీజేపీ ఎత్తుగడలేమీ సాగలేదు. అయితే పొంగులేటి కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరాల్సి వచ్చింది..? కొత్త పార్టీ పెట్టాలనుకున్న పొంగులేటి ఎందుకు ఆ దిశగా అడుగులేయలేదు..? ఒకటి కాదు రెండు కాదు అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, ఖమ్మం వేదికగా కీలక సమావేశాలు జరిగిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోలేకపోయిన పొంగులేటిని ఒప్పించి, మెప్పించి కాంగ్రెస్‌లో చేర్చించినదెవరు..? ఈ చేరికలో చక్రం తిప్పిందెవరు..? తెరవెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు..? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా పెద్దాయన..? తెరవెనుక చక్రం తిప్పాల్సిన అవసరం ఆయనకేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ఈయనే ఆ పెద్దాయన..!
ఇదిగో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) పక్కన నిల్చున్న వ్యక్తే.. పొంగులేటి కాంగ్రెస్ చేరికలో తెరవెనుక చక్రం తిప్పారు. ఆ పెద్దాయన పేరే రామసహాయం సురేందర్ రెడ్డి.. షార్ట్ కట్‌లో అభిమానులు, అనుచరులు RS (Ramasahayam Surender Reddy) అని పిలుచుకుంటూ ఉంటారు. ఈయన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. 1965లో జరిగిన ఉపఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1967లో కూడా కాంగ్రెస్ తరఫునే పోటీచేయగా మళ్లీ గెలిచి నిలిచారు. పీవీ నర్సింహారావుతో మంచి సాన్నిహిత్యం ఉండే వ్యక్తిగా గుర్తింపు ఉంది. సురేందర్ రెడ్డికి పెళ్లి తర్వాత ఆస్తులు బాగా కలిసొచ్చాయి. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో దాదాపు ఆయన్ను విజయం వరించింది. 1974, 1978,1983,1985 ఎన్నికల్లో డోర్నకల్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 1991 ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా గెలిచారు. 1996 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు.. వయసు రీత్యా నాటి నుంచి సురేందర్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
హీరో వెంకటేష్, పొంగులేటితో ఏంటి సంబంధం..!
సురేంద్రరెడ్డి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు రఘురామిరెడ్డికి (Raghurami Reddy) ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి.. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుమార్తె అశ్రితను (Ashritha) పెళ్లి చేసుకున్నారు. చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి.. పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని (Swapni Reddy) వివాహం చేసుకున్నారు. సురేంద్రరెడ్డి తర్వాత ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరూ వచ్చింది లేదు.. సరిగ్గా ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఓ ఆలోచన తట్టిందట. ఇంత కాంగ్రెస్ బ్యాగ్రౌండ్, ఆర్థికంగా అన్నివిధాలుగా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రాకపోవడమేంటి..? అని మీటింగ్ ఏర్పాటు చేసి పాలేరు నుంచి పోటీచేయించాలని అనుకున్నారట. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో చర్చించడం మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించడం కూడా జరిగిందట. ఈ క్రమంలోనే రఘురామిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని సురేందర్-రేవంత్ అనుకున్నారట. ఈ క్రమంలోనే తన వియ్యంకుడు పొంగులేటి ప్రస్తావన రావడం.. వరుసగా రెండు, మూడు భేటీలు జరగడంతో చేరిక వ్యవహారం కొలిక్కి వచ్చిందట. ఇక ఆ తర్వాత నేరుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం, మొదట బెంగళూరు ఆ తర్వాత హైదరాబాద్, ఖమ్మంలో భేటీలు జరిగాయట.
మొత్తమ్మీద చూస్తే.. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిక వెనుక ఎంత పెద్ద కథ నడిచింది. ఈ మొత్తమ్మీద కర్త, కర్మ, క్రియ అంతా సురేంద్ర రెడ్డే అన్న మాట. మరోవైపు.. పెద్దాయన కూడా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. 30 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లా రాజకీయాలు రామసహాయం చుట్టూ తిరిగేవని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు.. కాంగ్రెస్‌లో సురేందర్ రెడ్డికి ఎదురుండేది కాదు. ఈయన ఇప్పటి వరకూ తన శిష్యులుగా ఉన్న వారందర్నీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి కీలక పదవుల్లో కూర్చోబెట్టారు కానీ.. ఇంటి నుంచి ఒక్కరూ క్రియాశీలక రాజకీయాల్లో లేరు. తిరిగి లైమ్ లైట్‌లోకి రావాలనుకుంటున్న సురేంద్రరెడ్డి ఫ్యామిలీ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.