AP Politics : అమిత్ షాతో లోకేష్ భేటీ, చంద్రబాబు అరెస్ట్‌పై లాజిక్‌గా మాట్లాడిన పురందేశ్వరి!
ABN , First Publish Date - 2023-10-14T13:42:47+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest).. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో (Amit Shah) యువనేత నారా లోకేష్ (Nara Lokesh) భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeswari) స్పందించారు...
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandra Babu Arrest).. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో (Amit Shah) యువనేత నారా లోకేష్ (Nara Lokesh) భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeswari) స్పందించారు. శనివారం నాడు విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. ఈ రెండు పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘లోకేష్‌ను అమిత్‌షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతం. అమిత్ షా-లోకేష్ భేటీ (Amit Shah-Lokesh Meeting) జరిగింది. చంద్రబాబు ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారు. కిషన్ రెడ్డి నన్ను పిలిచారని లోకేష్ అన్నారు.. దాని గురించి ఆయన్నే అడగండి’ అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
మనసులో మాట!
చంద్రబాబు అరెస్ట్‌పై మొదటిసారి పురందేశ్వరి మీడియా వేదికగా స్పందించారు. ‘చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులే. ఇప్పుడు చంద్రబాబుపై కేసులు కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి.. సబ్ జుడిస్ కిందకు వస్తాయి’ అని పురంధేశ్వరి పేర్కొన్నారు. ‘గోదావరి జలాలను పెన్నాతో లింక్ చేసే ప్రాజెక్టును గత ప్రభుత్వం.. ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం గోదావరి-పెన్నా ప్రాజెక్టు డీపీఆర్ చూపించి రూ. 2 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఇది దారుణం కాదా..?. గతంలో ఏదైనా ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ వేయించారు.. ఇప్పుడు సీఎం మీద వస్తున్న ఆరోపణల మీద జగన్ సీబీఐ విచారణ చేయించగలరా..?’ అని సీఎంకు పురందేశ్వరి ఒకింత ఛాలెంజ్ చేశారు.
ధైర్యం ఉంటే చేయండి..?
ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని ప్రభుత్వాన్ని మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రానికల్లా కంపెనీ యజమానుల పేర్లు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ కంపెనీల యజమానులంతా వైసీపీ వాళ్లేనని వేరే చెప్పనవసరం లేదని ప్రభుత్వ తీరును పురందేశ్వరి దుయ్యబట్టారు. ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యజమానుల పేర్లన్నీ బయటపెట్లాని సవాల్ విసిరారు. మద్యం తయారు చేసినా.. అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని గతంలో సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఈ మీడియా మీట్ వేదికగా పురందేశ్వరి గుర్తు చేశారు. ఇప్పటికే పురందేశ్వరి వర్సెస్ వైసీపీగా పరిస్థితులున్నాయి. ఇప్పుడు పురందేశ్వరి ప్రశ్నలు, సవాళ్లపై వైసీపీ నేతల నుంచి.. ముఖ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.