CBN Health : జైల్లో చంద్రబాబుకు అనారోగ్యం.. రఘురామ ఎపిసోడ్‌ను గుర్తుకుతెస్తున్న జనం.. ఏం జరుగుతుందో..!?
ABN , First Publish Date - 2023-10-28T14:10:41+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్నారు. జైలుకెళ్లిన మొదటి వారం నుంచే బాబు అనారోగ్యానికి గురయ్యారు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్నారు. జైలుకెళ్లిన మొదటి వారం నుంచే బాబు అనారోగ్యానికి గురయ్యారు. డీ హైడ్రేషన్, చర్మ సంబంధిత వ్యాధులు, ఉన్న ఫళంగా బరువు తగ్గిపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు భద్రత విషయంలోనూ మొదట్నుంచీ అనుమానాలు కోకొల్లలు. దీంతో చంద్రబాబు ఆరోగ్య అంశాలపై (Chandrababu Health) రాష్ట్ర ప్రభుత్వం గురిపెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వయసును ఆసరాగా చేసుకొని శారీరకంగా కుంగుబాటుకు గురిచేయాలనే కుతంత్రం అమలుచేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనికి తోడు జైలు అధికారుల అసమగ్ర బులెటిన్లు అదే చెబుతుండటం, బాబు ఆరోగ్యం బాగానే ఉందని జైలు అధికారులు (Jail Officers) చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన అనారోగ్యంపై కావాలనే కాలయాపన చేస్తున్నారని సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్న పరిస్థితి. అయితే.. అసలు బాబు ఎలా ఉన్నారు..? ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలపై క్లారిటీ రావాలంటే ఒక్కటే మార్గమని.. గతంలో జరిగిన ఓ విషయాన్ని టీడీపీ శ్రేణులు (TDP Cadre) గుర్తు చేసుకోవడంతో పాటు.. ఇలా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇలా చేస్తే..!?
జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిణామాల నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnam Raju) ఉదంతాన్ని కొందరు గుర్తుకుతెస్తున్నారు. ఆయన్ను ఆరెస్టు చేసిన తర్వాత పోలీసులు కొట్టారని అభియోగం వచ్చింది. అదే విషయం ఆయన కోర్టుకు విన్నవించడంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు. యథావిధిగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే 'ఏమీ లేదనే' ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించగా ఆర్మీ ఆస్పత్రి (Army Hospital) వైద్యులతో పరీక్షలు చేయించాలని ఆదేశించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబుకు ఆర్మీ వైద్యులతో పరీక్షలు చేయించి నివేదికలను బహిర్గతపరచాలని టీడీపీ శ్రేణులు, రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోనే పారా మిలిటరీ బలమైన కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) బెటాలియన్ ఉంది. ఇక్కడి స్థావరంలో సీఆర్పీఎఫ్ వైద్యాధికారులు ఉంటారు. వారితోనైనా చంద్రబాబుకు సమగ్రమైన ఆరోగ్య పరీక్షలు చేయించాలని కొందరు వైద్యులు సూచిస్తు్న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి.. బాబు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందో లేదో చూడాలి మరి.
ఏదో జరుగుతోంది..?
మొత్తానికి చూస్తే.. చంద్రబాబు జైలుకు వచ్చిన నాటి నుంచి ఆయన ఆరోగ్యం విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న జనం ‘మొత్తానికి ఏదో జరుగుతోంది’ అనే ఆందోళన అయితే తెలుగు ప్రజల్లో కనిపిస్తోంది. జైలుకు వచ్చిన నాటికి ఇప్పటికీ చంద్రబాబు ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వచ్చాయని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే తన ఆరోగ్యం, భద్రతపై స్వయంగా చంద్రబాబే ఏసీబీ కోర్టు జడ్జికి మూడు పేజీల లేఖను రాశారు. శనివారం నాడు చంద్రబాబుతో ములాఖత్ అయిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అనంతరం టీడీపీ యువనేత నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అనారోగ్యం, జైలులో భద్రత లేదనే విషయాన్ని పూసగుచ్చినట్లుగా తెలిపారు.చంద్రబాబు బరువు తగ్గారన్నది నిజమేనని.. 72 నుంచి 66 కిలోలకు బరువు తగ్గారని ఎమోషనల్ అవుతూ లోకేష్ మీడియాకు తెలిపారు. అయితే.. బాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, డాక్టర్లపై వైసీపీ పెద్దల నుంచి ఒతిళ్లు ఉన్నాయని.. సజ్జల రామకృష్ణారెడ్డే మొత్తం చేస్తున్నారన్నట్లుగా లోకేష్ చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం ఇకనైనా కనీసం బాధ్యతగా వ్యవహరిస్తుందో.. లేకుంటే ఇంకా రాజకీయ కక్ష సాధిస్తుందో చూడాలి.