Somesh Kumar: సోమేశ్‌ను అక్కున చేర్చుకున్న కేసీఆర్.. ఏ కొలువు కట్టబెట్టారంటే..

ABN , First Publish Date - 2023-05-09T18:06:50+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ సర్కార్ కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళుతోంది. జాతీయ స్థాయిలో..

Somesh Kumar: సోమేశ్‌ను అక్కున చేర్చుకున్న కేసీఆర్.. ఏ కొలువు కట్టబెట్టారంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ సర్కార్ (BRS Govt) కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెళుతోంది. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కేసీఆర్ తన ప్రభుత్వంలో భాగం చేసుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన శరద్‌ మన్కడ్‌కు తెలంగాణ సర్కారు ఇటీవలే కొలువు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రైవేటు సెక్రటరీగా బీఆర్‌ఎస్ సర్కార్ అతనిని నియమించింది. ఆయన జీతం ఎంతో తెలుసా!? ఏడాదికి రూ.18 లక్షలు! అంటే, నెలకు లక్షన్నర! ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మే 2, 2023న ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

6cKN_el4_400x400.jpg

ఈ నియామకం జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకముందే మరో కండువా కొలువును కేసీఆర్ తన ప్రీతిపాత్రుడికి కట్టబెట్టారు. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను (Somesh Kumar) బీఆర్‌ఎస్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం (09-05-2023) ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

700eec63-57d4-4427-82c1-9d4e06ba385b.jpg

కేబినేట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమేశ్ కుమార్‌ను నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్ కుమార్ మూడు సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు.

66e5ed6e-b771-48f2-b58c-78b6a4c27aed.jpg

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బిహార్‌కు చెందిన ఆయన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా.. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే క్యాట్‌ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరో అవకాశం లేకపోవడంతో 2023 ఫిబ్రవరిలో ఆయన ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు. ఆ వెంటనే హైదరాబాద్‌కు వచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, మరో రాష్ట్రంలో అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి సోమేశ్‌ ఇష్టపడలేదు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ కథనం కూడా ప్రచురించింది. దానిని ఆయన ఖండించినప్పటికీ కొద్ది రోజుల తర్వాతే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆమోద ముద్ర వేశారు.

CM-KCR.jpg

వాస్తవానికి సోమేశ్‌ కుమార్‌కు 2023 డిసెంబర్‌ వరకూ సర్వీస్‌లో కొనసాగే అవకాశముంది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మరో పోస్టులో కొనసాగడానికి వీలుగా ఆయన ముందుగా వీఆర్‌ఎస్‌ తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇటు డీవోపీటీ నిబంధనల ప్రకారం 30 ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసిన వారు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే.. దానిని కేంద్రం ఆమోదించాల్సిన అవసరం లేదు. సదరు అధికారులు ఏ రాష్ట్రానికి కేటాయించిన వారు అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వమే వీఆర్‌ఎస్‌ను ఆమోదించవచ్చు. సోమేశ్‌ కుమార్‌ కూడా ఈ నిబంధనలను ఉపయోగించుకుని వీఆర్‌ఎస్‌ను ఆమోదింప చేసుకున్నట్లు ఐఏఎస్‌ వర్గాల్లో చర్చ జరిగింది. ఇన్ని నెలల తర్వాత సోమేశ్ కుమార్‌ను మళ్లీ తెలంగాణ ప్రభుత్వమే అక్కున చేర్చుకుంది.

KCR-2.jpg

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రాజీవ్ శర్మ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిలో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నర్సింగరావు ఉన్నారు. అయినా సోమేశ్ కుమార్‌ను తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అవ్వడానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవే అయినప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ కోసం సోమేశ్ కుమార్ పనిచేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం సోమేశ్‌కు ఉండనే ఉంది. ప్రజల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని తగ్గించే మార్గాలను అన్వేషించడమే సోమేశ్ విధిగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విక్టరీనే లక్ష్యంగా సోమేశ్ పాలనాపరంగా పావులు కదపనున్నారు. అయితే.. రాజకీయంగా సోమేశ్ నియామకం పెను దుమారాన్ని రేపింది. ప్రతిపక్షాలు సోమేశ్‌కు కొలువు కట్టబెట్టడంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి.

Updated Date - 2023-05-09T18:16:25+05:30 IST