Soma Bharat: కవిత ఈడీ ఎపిసోడ్‌లో కీలకంగా వ్యవహరించిన ఈ మాస్టర్‌మైండ్ తక్కువోడేం కాదు..!
ABN , First Publish Date - 2023-03-16T18:17:47+05:30 IST
తెలుగు మీడియాలో ఇవాళ ప్రముఖంగా హైలైట్ అయిన వార్తాంశం ఏదైనా ఉందంటే కవిత ఈడీ విచారణపై (Kavitha ED Enquiry) నెలకొన్న హైడ్రామా అని..
తెలుగు మీడియాలో ఇవాళ ప్రముఖంగా హైలైట్ అయిన వార్తాంశం ఏదైనా ఉందంటే కవిత ఈడీ విచారణపై (Kavitha ED Enquiry) నెలకొన్న హైడ్రామా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Case) మార్చి 11న ఈడీ విచారణకు హాజరైన కవిత (BRS MLC Kavitha) గురువారం (మార్చి 16) ఉదయం 11 గంటలకు మరోమారు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 11.30 దాటినా కవిత ఈడీ విచారణకు వెళ్లకపోవడంతో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టలేదు. అప్పుడే.. ఉన్నట్టుండి కవిత ఈడీ ఎపిసోడ్‌లో ఒకరి పేరు తెరపైకొచ్చింది. ఆ పేరే సోమా భరత్ కుమార్. బీఆర్‌ఎస్ లీగల్ సెల్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న సోమా భరత్ కవిత తరపున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్‌కు వెళ్లారు. కవిత ఈడీకి రాసిన లేఖను అధికారులకు సమర్పించి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
కవిత తరపున ప్రతినిధిగా ఈడీ ఆఫీస్‌కు వెళ్లిన ఈ సోమా భరత్ కుమార్ ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా మొదలైంది. కేసీఆర్ కుటుంబానికి ఈ సోమా భరత్ కుమార్ నమ్మిన బంటులా వ్యవహరిస్తున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన భరత్ కుమార్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోట గ్రామం. వృత్తి రీత్యా పేరు మోసిన సీనియర్ అడ్వకెట్. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ పార్టీకి న్యాయపరంగా ఎదురైన చిక్కులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ పార్టీ వ్యవహారాల్లో కూడా యాక్టివ్‌గా వ్యవహరించడంతో సోమా భరత్ కుమార్‌ను కేసీఆర్ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
అంతేకాదు.. 2022లో కేసీఆర్ ఆయనను తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (TSDDCF) చైర్మన్‌గా నియమించారు. ప్రగతిభవన్‌కు పిలిచి మరీ కేసీఆర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. తాజాగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి అడ్వకెట్ సోమా భరత్ కుమార్ క్రియాశీలకంగా మారారు. బీఆర్‌ఎస్ లీగల్ విభాగంలో సోమా భరత్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులను ఎదుర్కొనేందుకు కవిత దాదాపుగా సోమా భరత్ కుమార్‌నే నమ్ముకున్నారని చెప్పక తప్పదు. కవిత తొలుత ఈడీ విచారణకు హాజరయిన సందర్భంలో కూడా ఆమెతో పాటే సోమా భరత్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో లీగల్‌గా తనకున్న సర్కిల్‌ను ఉపయోగించుకుని సోమా భరత్ కూడా దాదాపుగా కవితను ఈడీ విచారణ నుంచి కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.
కవిత ఈడీ విచారణకు గైర్హాజరవడంపై సోమా భరత్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కవిత తరపున ఈడీకి డాక్యుమెంట్లు సమర్పించామని, కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని లీగల్ పాయింట్లను కూడా లేవనెత్తారు. సీఆర్పీసీ, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని, 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందని గుర్తుచేశారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందని, ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని తెలిపారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరపాలని కవిత తరపు లీగల్ ప్రతినిధిగా వ్యవహరించిన సోమా భరత్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు మరోమారు సమన్లు జారీ చేశారు. మార్చి 20న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. మార్చి 20 వరకూ సమయం ఉండటంతో ఈలోపు ఈడీ విచారణను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కవిత, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్‌ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది.