Lokesh Yuva Galam : మునిరాజమ్మా.. మీ తెగువకు వందనం.. ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారన్న చంద్రబాబు.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-02-28T21:46:37+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో (Yuva Galam) పెద్దఎత్తున స్పందన వస్తోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. టీడీపీ (TDP) అధికారంలోకి ఏమేం కార్యక్రమాలు చేపడతామో
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో (Yuva Galam) పెద్దఎత్తున స్పందన వస్తోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. టీడీపీ (TDP) అధికారంలోకి ఏమేం కార్యక్రమాలు చేపడతామో అన్నీ వివరంగా చెబుతూ ముందుకెళ్తున్నారు. 29వ రోజు పాదయాత్రలో భాగంగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని మామండూరులో రజక సామాజికవర్గం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమకు దోబీ ఘాట్స్ లేవని.. ఉన్నచోట కనీస వసతులు కూడా లేవని బాధలు చెప్పుకున్నారు. దోబీ ఘాట్స్‌కు కరెంట్ బిల్లుల బాదుడు భరించలేకపోతున్నామని లోకేష్‌కు చెబుతూ మహిళలు కంటతడిపెట్టారు. వీరితో పాటు మునిరాజమ్మ తన సమస్యను లోకేష్‌కు చెప్పుకున్నారు. ‘ఏ తప్పు చేయని నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ప్రాణాలు పోయినా సరే మధుసూధన్ రెడ్డికి క్షమాపణ చెప్పేది లేదు. ఇళ్లు కూల్చేస్తే చెట్టు కింద బ్రతుకుతాం అంతేకానీ వైసీపీ వాళ్లకు అణిగిమణిగి ఉండే ప్రసక్తే లేదు’ అని లోకేష్‌కు వివరించారు మునిరాజమ్మ (Muni Rajamma). అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మరోసారి ఆమెను వైసీపీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది.
ఆ మహిళ ఏమన్నారు..?
తన సమస్యను మరోసారి 30వ రోజు పాదయాత్రలో మునిరాజమ్మ లోకేష్‌కు చెప్పారామె. ‘ మాది శ్రీకాళహస్తి. మాకున్న బాధల గురించి లోకేష్ సార్ వచ్చినప్పుడు చెప్పాను. మీడియా వాళ్లు అడిగితే కూడా అన్ని విషయాలు చెప్పాను. వైసీపీ వాళ్లు మా టిఫిన్ సెంటర్ మీద పడి ధ్వంసం చేశారు. నన్ను నడివీధిలో చీర విప్పుతామని బెదిరించారు. నాకు ఇద్దరు ఆరోగ్యం బాగోలేని పిల్లలు ఉన్నారు. ఇద్దరి చికిత్స కోసం 7 లక్షల రూపాయిలు అప్పు చేశాను. ఆ డబ్బులకు వడ్డీ కట్టడానికే నేను టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మమ్మల్ని సంవత్సరం పాటు ఊరు వదిలి వెళ్లిపోమంటున్నారు. లేదంటే ఆఫీసుకు వచ్చి క్షమాపణ కోరి.. వాళ్లు చెప్పింది చేస్తే మాకు క్షమాభిక్ష పెడతామన్నారు. నేను చనిపోవడానికి అయినా సరే కానీ.. పార్టీ ఆఫీసుకు వచ్చి క్షమాపణ చెప్పనని తేల్చిచెప్పాను’ అని లోకేష్ సభలో మునిరాజమ్మ చెబుతూ కంటతడిపెట్టారు. పక్కనే ఉన్న లోకేష్‌ను ఆ మహిళను ఓదార్చి.. అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
నీ తెగువకు వందనం..!
మహిళా ఆవేదన విన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) చలించిపోయారు. ‘ప్రాణాలు పోయినా పర్లేదు కానీ వైసీపీ ముష్కర మూకకి క్షమాపణ (Sorry) చెప్పేది లేదన్న మునిరాజమ్మ తెగువకు వందనం. వైసీపీ పాలనపై నిరసనగళం వినిపించిన బలహీన వర్గాల మహిళ హోటల్‌ను కూల్చి వైసీపీ రాజకీయం పాతాళానికి పడిపోతే... బెదరక నిలబడిన మునిరాజమ్మ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
నెట్టింట్లో ప్రశంసలు..!
‘వీరవణిత మునిరాజమ్మ తెగువకు పాదాభివందనం.. ప్రతి మహిళ మునిరాజమ్మ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. రజకులపై దాడులు దౌర్జన్యాలు చేసే వారిపై కఠినంగా శిక్షించే చట్టాలను తీసుకురావాలని బాబు గారికి విన్నవించుకుంటున్నాను’ అని కొందరు టీడీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘మునిరాజమ్మగారు మీరు అధైర్యం పడకండి.. బాబు గారు వస్తారు మన సమస్యలన్నింటినీ తీరుస్తారు’ అని నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు.