Lokesh CID Enquiry : సీఐడీ విచారణలో 7 గంటలపాటు లోకేష్‌ను ఏమేం అడిగారు..?
ABN , First Publish Date - 2023-10-10T20:17:22+05:30 IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ సీఐడీ విచారణకు (Lokesh CID Enquiry) హాజరైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ సీఐడీ (AP CID) అధికారులు ప్రశ్నించారు...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ సీఐడీ విచారణకు (Lokesh CID Enquiry) హాజరైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ సీఐడీ (AP CID) అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఐడీ సంధించిన ప్రతి ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారని తెలిసింది. సుదీర్ఘ విచారణ అనంతరం మీడియా ముందుకు లోకేష్.. 7 గంటలపాటు ఏం జరిగింది..? ఏమేం ప్రశ్నలు సంధించారు..? లోకేష్ చెప్పిన సమాధానాలు ఏంటి..? అనే విషయాలు నిశితంగా వివరించారు.
ఏమేం అడిగారు..?
‘దాదాపు ఆరున్నర గంటలపాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో (Amaravati Inner Ring Road) సంబంధం లేని 50 ప్రశ్నలు అడిగారు. ఒకే ప్రశ్న ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, మంత్రివర్గ ఉపసంఘం ముందుకు ప్రతిపాదన వచ్చిందా..? అని అడిగారు. గూగుల్‌లో (Google) దొరికే సమాధానాలే నన్ను అడిగారు. నా ముందు ఎలాంటి ఆధారాలు పెట్టలేదు. నేను హెరిటేజ్ (Heritage) ఈడీగా ఎలా పనిచేశానో వాటికి సంబంధించి 49 ప్రశ్నల వరకూ అడిగారు. ఇది కక్షసాధింపు తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. నేను, చంద్రబాబుగారు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా ఈరోజే ఎంత సమయమైనా ఉంటా అని చెబితే.. మళ్లీ రేపు (మంగళవారం) రమ్మని 41ఏ నోటీసు ఇచ్చారు. నాకు రేపు (అక్టోబర్-11న) వేరే పని ఉందని చెప్పినా.. రేపు మళ్లీ ఉదయం 10గంటలకు రమ్మన్నారు, ఖచ్చితంగా వస్తానని చెప్పాను. అవగాహన లేని సైకో జగన్ ఎన్ని అయినా మాట్లాడతారు. ఆయన డీజీపీ దగ్గర పాఠాలు చెప్పించుకుంటే మంచిది’ అని లోకేష్ చెప్పుకొచ్చారు.
నవ్వుతూ పలకరింపులు..
కాగా.. సీఐడీ విచారణ తర్వాత బయట మీడియాతో మాట్లాడిన అనంతరం స్థానికులు, టీడీపీ ముఖ్య కార్యకర్తలతో లోకేష్ మాట్లాడారు. సీఐడీ క్యాంపు కార్యాలయం తన నియోజకవర్గమైన మంగళగిరిలో ఉండటంతో అందరినీ ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత తన కోసం ఎదురుచూస్తున్న అపార్ట్‌మెంట్ వాసుల దగ్గరికొచ్చి మాట్లాడారు. ఎలా ఉన్నారు..? మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ విచారణ తరువాత కూడా నవ్వుతూ స్థానికులను లోకేష్ పలకరించారు. స్థానికులు, టీడీపీ శ్రేణులు లోకేష్‌ను చూడగానే.. ‘జై లోకేష్..’ ‘సైకిల్ రావాలి.. సైకో పోవాలి’ అంటూ పెద్ద పట్టున నినాదాలు చేశారు. అభివాదం చేస్తూనే అక్కడ్నుంచి ఉండవల్లిలోని నివాసానికి లోకేష్ వెళ్లారు. అంతకుమునుపు.. సిట్ కార్యాలయం వద్దకు వచ్చిన, ఆ మార్గ మధ్యలో వస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అడ్డంకులను ఛేదించుకుని మరీ సిట్ కార్యాలయం దగ్గరికి భారీగా తెలుగు తమ్ముళ్లు చేరుకున్నారు. లోకేష్‌కు బయటికి రాగానే ఆయనతో మాట్లాడి.. నినాదాలు చేశారు.