Pawan Kalyan: పవన్ చెప్పకపోయినా రఘురామ చెప్పేశారు.. జనసేనలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

ABN , First Publish Date - 2023-07-21T15:50:01+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ మళ్లీ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా భీమవరంపై అందరి దృష్టి పడింది. గతంలో అదే స్థానం నుంచి పవన్‌కళ్యాణ్‌ పోటీ చేశారు. తెలుగుదేశం మూడోస్థానంలో నిలిచినప్పటికీ మంచి ఓట్లునే సాధించింది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఓట్లను కలిపితే మెజారిటీ దాదాపు 45 వేల వరకు ఉంటుంది. పొత్తులో అక్కడ సునాయాస విజయం తప్పదని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తే భారీ మెజారిటీ వస్తుందన్న అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.

Pawan Kalyan: పవన్ చెప్పకపోయినా రఘురామ చెప్పేశారు.. జనసేనలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఒకవైపు ‘యువగళం’ పాదయాత్రతో లోకేశ్, మరోవైపు ‘వారాహి’ యాత్రతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కార్ తీరును ప్రజల ముందు ఎండగట్టడమే పనిగా పెట్టుకోవడంతో వైసీపీలో కలవరం మొదలైంది. ఈ క్రమంలోనే జనసేనాని ఎన్డీయే మిత్ర పక్ష భేటీకి హాజరు కావడం, ఢిల్లీ పెద్దలను కలిసిన సందర్భంలో ఏపీలో పొత్తులపై చర్చ జరిగినట్టుగా వార్తలు వస్తుండటంతో వైసీపీలో టెన్షన్ నెలకొంది. ఢిల్లీలోనే ఉన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా పవన్‌ను కలవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రఘురామ రాజు జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది.

9janasena-(1).jpg

ఈ పుకార్ల సంగతి కాసేపు పక్కన పెడితే.. పవన్‌తో భేటీ అనంతరం రఘురామ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు 100శాతం ఉంటుందని వైసీపీ ఎంపీ రఘురామరాజు అన్నారు. బుధవారం ఆయన పవన్‌ కల్యాణ్‌తో మంతనాలు జరిపారు. చర్చల అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తు కచ్చితంగా ఉంటుందన్న విశ్వాసం తనకు కలిగిందన్నారు. భీమవరం నుంచి పోటీ చేయాలని తాను కోరగా.. జనసేనాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. మురళీధరన్‌తో పవన్‌ నిరంతరం టచ్‌లో ఉన్నారన్నారు. మొత్తంగా చూసుకుంటే రఘురామ మాటలతో ఓ విషయం మాత్రం స్పష్టమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ మళ్లీ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

360093139_817455079749346_2527485935966807645_n.jpg

పొత్తుల్లో భాగంగా భీమవరంపై అందరి దృష్టి పడింది. గతంలో అదే స్థానం నుంచి పవన్‌కళ్యాణ్‌ పోటీ చేశారు. తెలుగుదేశం మూడోస్థానంలో నిలిచినప్పటికీ మంచి ఓట్లునే సాధించింది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఓట్లను కలిపితే మెజారిటీ దాదాపు 45 వేల వరకు ఉంటుంది. పొత్తులో అక్కడ సునాయాస విజయం తప్పదని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తే భారీ మెజారిటీ వస్తుందన్న అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. భీమవరంలో ఆయనే పోటీ చేస్తారన్న అభిప్రాయం అత్యధికుల్లో ఉంది. ఒక దశలో పిఠాపురంలోనూ పోటీ చేస్తారన్న చర్చ సాగింది. ఒకవేళ పవన్‌ పోటీ చేయకపోతే రెండు పార్టీల నుంచి భీమవరం బరిలో నిలిచేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. జనసేన నుంచి టిక్కెట్‌ ఆశించే నాయకుడు ఇదివరకే సొంత సర్వే చేశారు. జనసేన కూడా భీమవరంలో బలీయంగానే ఉందంటూ ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.


పవన్‌ కళ్యాణ్‌ భీమవరం నుంచి ఆసక్తి చూపకపోయినా సీటు మాత్రం జనసేన ఖాతాలో ఉంటుందన్న విశ్వాసం ఆ పార్టీ కేడర్‌లో ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన పవన్ కల్యాణ్‌కు 62,285 ఓట్లు పోలయ్యాయి. భీమవరం నియోజకవర్గంలోని 32 శాతం మంది ఓటర్లు పవన్‌కు మద్దతుగా ఓటేశారు. టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు కూడా మూడో స్థానంలో నిలిచినప్పటికీ 54,037 ఓట్లు పోలవడం విశేషం. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌కు 8,357 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమై.. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీ ఖాయంగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

TDP-BJP-Janasena.jpg

పవన్ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. రెండు చోట్ల ఓడిన ఎమ్మెల్యే అని పవన్‌ను అపహాస్యం చేసిన వైసీపీకి భీమవరం నుంచే అఖండ మెజారిటీతో గెలిచి పవన్ నోళ్లు మూయించాలని జనసేన శ్రేణులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. పైగా.. పవన్‌పై గెలిచానని చెప్పుకోవడమే తప్ప వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదని.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి కూడా పవన్‌కు రికార్డ్ మెజారిటీ సాధించేందుకు అనుకూలించే అంశమని స్థానికంగా ఉన్న జనసేన కేడర్ గట్టి నమ్మకంతో ఉంది. ఏదేమైనా.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత ఒక చోట పోటీ చేస్తారో, రెండు చోట్ల పోటీ చేస్తారో స్పష్టత లేకపోయినప్పటికీ భీమవరం నుంచి బరిలో నిలవడం ఖాయమైనట్టేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Updated Date - 2023-07-21T15:59:16+05:30 IST