China Schools: మన దగ్గర కూడా ఇలాంటి రూల్ వస్తుందా..? చైనా స్కూళ్లల్లో మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా..!
ABN , First Publish Date - 2023-11-29T16:06:56+05:30 IST
భోజనం తరువాత చైనా పిల్లలు ఇలా చేస్తారని వినగానే భారతీయ తల్లిదండ్రులు, విద్యాసంస్థల యజమానులు బహుశా ఉలిక్కిపడతారేమో.. కానీ ఈ వీడియో చూస్తే..
చైనా వింత పోకడలకు నెలవు. వారి ఆహారం దగ్గర నుండి ఉద్యోగాల వరకు అంతా విభిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు స్కూళ్లలో కూడా ఓ విభిన్నమైన రూల్ నడుస్తున్నట్టు సమాచారం. ఎక్కడైనా సరే స్కూల్లో పిల్లలకు భోజన విరామం అయిపోగానే పిల్లలంతా తరగతులతో హాజరైపోతారు. ఉపాధ్యాయులు మళ్లీ పాఠాలు చెప్పడం మొదలుపెడతారు. కానీ చైనాలో కొన్ని స్కూళ్ళలో దీనికి భిన్నంగా ఉంటుంది. భోజనం అవ్వగానే పిల్లలు హాయిగా స్కూళ్లలో నిద్రపోతారు. ఈ మాట వినగానే భారతీయ తల్లిదండ్రులు, విద్యాసంస్థల యజమానులు బహుశా ఉలిక్కిపడతారేమో.. కానీ ఇది అక్షరాలా నిజం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పలువురు 'భారత్ లో కూడా ఇలాంటి రూల్ వస్తుందా?' అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
భోజనం చేసిన తరువాత హాయిగా కునుకు తీస్తే ఎంత బాగుంటుందో. ఇళ్లలో ఉండే చాలామంది ఈ పని చేస్తారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా తినగానే నిద్రపోతారు. కానీ స్కూళ్లలో మాత్రం భోజన విరామంలో భోజనం చేయగానే తిరిగి తరగతుల్లోకి వెళతారు. ఒకవేళ భోజనం తొందరగా ముగిస్తే స్కూలు ఆవరణలో కాసేపు ఆడుకుంటారు. కానీ చైనా(China)లో కొన్నిస్కూళ్లు మాత్రం దీనికి విభిన్నంగా ఉంటాయి. భోజనం చెయ్యగానే పిల్లల్ని హాయిగా కొద్దిసేపు నిద్రపోమని చెబుతాయి(china school kids take a nap after lunch). ఇందుకోసం పిల్లలు తరగతిలో కూర్చునే కుర్చీలనే పడుకునే బెడ్ లు గా మార్చే సౌకర్యం కూడా ఏర్పాటు చేశాయి. ఇంకా పిల్లలు కావాలి అంటే అక్కడి టీచర్లు దిండ్లు కూడా ఇస్తారు. పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఎవరికీ నిద్రాభంగం కాకుండా ఉండేందుకు తరగతి టీచర్ వారిని కనిపెట్టుకుని ఉంటుంది. పిల్లలు నాన్ స్టాప్ గా తరగతులు వింటూంటే వారికి బోర్ కొడుతుంది. తొందరగా అలసిపోతారు. పిల్లలు ఇలా నిద్రపోవడం వల్ల వారి మెదడు రిలాక్స్ అవుతుందని, ఆ తరువాత తరగతులు చక్కగా వింటారని పాఠశాల యజమానులు చెబుతున్నారు. పిల్లలు తరగతిలో నిద్రపోతన్న వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.
ఇది కూాడా చదవండి: చలికాలంలో వచ్చే సమస్య ఇదే.. కాళ్లకు ఇలా పగుళ్లు వస్తే..!
చైనా స్కూల్లో పిల్లలు నిద్రపోతున్న వీడియోను WOw Videos అనే ట్విట్టర్ ఎక్స్ (Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'భారతదేశంలో తొందరలో ఇలాంటి సౌకర్యం రావచ్చేమో' అని ఒకరు కామెంట్ చేశారు. 'అమెరికాలోని పలు కంపెనీలు తమ ఉద్యోగస్తులకు ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేస్తాయి. దీనివల్ల ఉద్యోగస్తులు మరింత చురుగ్గా పనిచేయగలుగుతారు' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఈ ఆలోచన బాగుంది. పిల్లలకు పాఠాశాలకు వెళ్లాలన్నా, పాఠాలు వినాలన్నా వ్యతిరేకత చూపించరు' అని ఇంకొకరు అన్నారు.