Habitats on moon: చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు దిశగా చైనా కీలక అన్వేషణ!.. ఏం చేయబోతుందో తెలుసా.. ఇదే కానీ జరిగితే...
ABN , First Publish Date - 2023-04-24T15:48:08+05:30 IST
అందాల జాబిల్లిపై (Moon) నివాసానికై ఎన్నో దశాబ్ధాలుగా పరిశోధనలు, అలుపెరుగని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా చైనా శాస్త్రవేత్తలు కీలక అన్వేషణకు సిద్ధమయ్యారు.
బీజింగ్: అందాల జాబిల్లిపై (Moon) నివాసానికై ఎన్నో దశాబ్ధాలుగా పరిశోధనలు, అలుపెరుగని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా చైనా శాస్త్రవేత్తలు కీలక అన్వేషణకు సిద్ధమయ్యారు. 3డీ టెక్నాలజీని (3D printing technology) ఉపయోగించి చంద్రుడిపై భవనాలు నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. జాబిల్లిపై ఎక్కువ కాలంపాటు ఆవాసం ఉండేలా రూపొందిస్తున్న ప్రణాళికల్లో ఇది అంతర్భాగమని చైనా అధికారిక మీడియా ‘చైనా డైలీ’ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
2013లో చైనా తొలిసారి లూనార్ ల్యాండింగ్ చేసింది. ఆ తర్వాత 2020లో మానవరహిత లూనార్ మిషన్ ‘చెంగ్ ఈ 5’ సాయంతో చంద్రుడిపై పలు అన్వేషణలు చేసింది. తొలిసారి చంద్రుడిపై శాంపిల్స్ సేకరించి భూమ్మీదకు మోసుకొచ్చింది. ఇక 2030 నాటికి ఒక వ్యోమగామిని చంద్రుడిపై దించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అప్పటిలోగా చెంగ్ఈ 6,7, 8 మిషన్లను ప్రయోగించనుంది. అనంతరం చంద్రుడిపై మానవ ఆవాసం ఎక్కువకాలం కొనసాగేలా పునర్వినియోగ వనరులపై డ్రాగన్ శాస్త్రవేత్తలు దృష్టిసారించనున్నారు. చెంగ్ఈ 8 మిషన్ ద్వారా సంబంధిత ప్రదేశంలో వాతావరణం, అక్కడి ఖనిజ మిశ్రమాలను పరిశీలించనున్నారు. అదే విధంగా చంద్రుడి ఉపరితలంపై 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించనున్నారు. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన శాస్త్రవేత్త వూ వెరెన్ తెలిపినట్టు చైనా డైలీ పేర్కొంది.
జాబిల్లిపై ఎక్కువ కాలంపాటు నివాసం ఉండాలనుకుంటే చంద్రుడిపై వనరులను ఉపయోగించుకొని ఆవాసాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా చైనాపై మట్టినే ఉపయోగించి ఐదేళ్లలో చంద్రుడిపై బేస్ ఏర్పాటు చేసుకోవాలని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారని ఈ నెలలోనే చైనా మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. చెంగ్ఈ 8 మిషన్‌లో భాగంగా ఈ పనిని ఒక రోబోకి ఈ పని అప్పగించే అవకాశాలున్నాయి. 2028లో ఈ రోబో ‘లునార్ సాయిల్ బ్రిక్స్’ తయారు చేయడం ప్రారంభించే అవకాశాలున్నాయని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన నిపుణుడు ఒకరు వెల్లడించారు. కాగా చంద్రుడిపై ఆవాసానికి సంబంధించిన ప్రయోగాలు గత కొన్నేళ్లుగా ఊపందుకున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా ఈ పరిశోధనల సంఖ్యను పెంచింది.
ఇవి కూడా చదవండి...