Marriage: వధువు మెడలో తాళి కట్టబోతుండగా బిగ్ షాక్.. సడన్‌గా వేదికపైకి ఓ కుర్రాడి ఎంట్రీ.. వరుడిని పక్కకు నెట్టేసి మరీ..!
ABN , First Publish Date - 2023-05-19T12:54:47+05:30 IST
తెలిసీ తెలియని వయసులో కొందరు తీసుకునే నిర్ణయాలు జీవితాలను బుగ్గిపాలు చేస్తుంటాయి. ప్రేమ, వ్యామోహాలు, ఆకర్షణలో యువత దారి తప్పుతోంది. దీనికి పెరిగే
తెలిసీ తెలియని వయసులో కొందరు తీసుకునే నిర్ణయాలు జీవితాలను బుగ్గిపాలు చేస్తుంటాయి. ప్రేమ, వ్యామోహాలు, ఆకర్షణలో యువత దారి తప్పుతోంది. దీనికి పెరిగే వాతావరణం కావొచ్చు. లేదంటే సినిమాల ప్రభావం కావొచ్చు. సరైన మెచ్చురిటీ లేక తప్పటడుగులు వేస్తుంటారు. ఆ సమయంలో పెద్దలు చెప్పినా.. తల్లిదండ్రులు చెప్పినా బుర్రకు ఎక్కించుకోరు. అంతగా మైకంలో ఉండిపోతారు.
అదో పెళ్లి వేడుక. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల రాకతో కళ్యాణమండపం కళకళలాడుతోంది. సందడి.. సందడిగా వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేదికపై వధూవరులు ఆసీనులై ఉన్నారు. కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టే సమయం దగ్గర పడింది. ఇంతలో ఓ యువకుడు వేదికపైకి సడన్ ఎంట్రీ ఇచ్చి వధువు నుదుట సింధూరం పెట్టాడు. దీంతో వరుడుతో సహా పెళ్లికొచ్చిన అతిథులంతా ఒక్కసారిగా షాకైపోయారు. ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని ఘాజీపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు గతంలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో ఆ యువతికి వేరే గ్రామానికి చెందిన అబ్బాయితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. ఈ నెల 17న పెళ్లి వేడుక జరుగుతోంది. వధువు.. వరుడి మెడలో పూలదండ వేస్తుండగా ఊహించని రీతిలో మాజీ ప్రియుడు వేదికపైకి వచ్చి వధువు నుదుటన సింధూరం (Sindoor) పెట్టాడు. దీంతో వరుడితో సహా వచ్చిన అతిథులంతా షాకైపోయారు. వెంటనే తేరుకున్న అతిథులు, బంధువులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా ఇలానే యువతి వివాహాన్ని చెడగొట్టినట్లు తెలిసింది.
తాజాగా జరిగిన పరిణామాన్ని గమనించిన వరుడు ఈ పెళ్లి తనకొద్దంటూ తేల్చిచెప్పేశాడు. పెళ్లి మండపం దగ్గర నుంచీ వరుడు సహా అతడి బంధువులంతా తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారు. మరోసారి పెళ్లి చెడిపోవడంతో అమ్మాయి.. ఆమె తల్లిదండ్రులు విచారంలో మునిగిపోయారు.