World Cup Chess Final: టై బ్రేకర్‌లో పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. మాగ్నస్ విజయం
ABN , First Publish Date - 2023-08-24T17:35:11+05:30 IST
చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా మరోసారి వరల్డ్ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచాడు.
చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా మరోసారి వరల్డ్ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. ఎంతో ఉత్కంఠ రేపిన వరల్డ్ కప్ చెస్ ఫైనల్ టై బ్రేకర్ చప్పగా ముగిసింది. మంగళ, బుధవారాల్లో జరిగిన తొలి రెండు గేమ్స్ డ్రాగా ముగియడంతో గురువారం నాడు టై బ్రేకర్ నిర్వహించగా నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ 1-0 తేడాతో విజయం సాధించాడు. చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలుద్దామని ప్రయత్నించిన ప్రజ్ఞానందకు చివరకు నిరాశే మిగిలింది.
ఇది కూడా చదవండి: Wrestling: భారత రెజ్లర్లకు ఎదురుదెబ్బ.. WFIపై సస్పెన్షన్ వేటు
గురువారం జరిగిన టై బ్రేకర్‌లో కార్ల్సన్ స్కోరు 1.5, ప్రజ్ఞానంద స్కోరు 0.5గా నమోదయ్యాయి. తొలి టై బ్రేక్ గేమ్‌లో 47 ఎత్తుల్లో చిత్తయిన ప్రజ్ఞానంద.. రెండో టై బ్రేక్ గేమ్‌ను 21 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. ముఖ్యంగా టై బ్రేక్ రెండు గేమ్స్‌లో కార్ల్సన్ దూకుడుగా ఆడాడు. తొలి గేమ్‌లో విజయం సాధించిన అతడు రెండో గేమ్‌ను డ్రాగా ముగించాడు. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద టై బ్రేకర్ తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడి ఆరంభంలో కార్ల్‌సన్‌ను ఒత్తిడికి గురిచేశాడు. అయితే తన సీనియారిటీని ఉపయోగించి ప్రజ్ఞానందను కార్ల్సన్ వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా ఎత్తుకు పైఎత్తులు వేసి తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రెండో గేమ్‌లో కూడా అతడు వెనుక బడ్డాడు. రెండో గేమ్‌ను కార్ల్సన్ తెల్లపావులతో ఆడగా ప్రజ్ఞానంద నల్లపావులతో ఆడారు. ప్రారంభం నుంచే మాగ్నస్ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కొద్ది సమయం తర్వాత ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. దీంతో కార్ల్సన్ ఛాంపియన్‌గా నిలవగా.. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు.